Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు అంతా సిద్ధం.. ఓపెనింగ్ సెర్మనీ చరిత్రలో తొలిసారి ఇలా.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్
Paris Olympics 2024 Opening ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024కు అంతా రెడీ అయింది. ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా జరగనుంది. ఈ ఆరంభ వేడుక టైమ్, లైవ్ ఎలా చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
క్రీడా ప్రపంచమంతా ఎదురుచూస్తున్న మహా సంగ్రామం పారిస్ ఒలింపిక్స్ 2024కు సర్వం సిద్ధమైంది. 206 దేశాల నుంచి 10వేలకు మందికి పైగా అథ్లెట్లు ఈ టోర్నీలో తలపడనున్నారు. పతకాల కోసం హోరాహోరీ పోటీపడనున్నారు. ఫ్రాన్స్ రాజధాని వేదికగా పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ రేపు (జూలై 26) జరగనుంది. అయితే, ఈ వేడుకకు ముందే క్రీడాపోటీలు నేడే (జూలై 25) మొదలవుతున్నాయి. భారత ఆర్చర్లు నేడే రంగంలోకి దిగనున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మనీ టైమ్, లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..
ఓపెనింగ్ సెర్మనీ డేట్, టైమ్
పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మనీ భారత కాలమానం ప్రకారం రేపు (జూలై 26) రాత్రి 11 గంటల 30 నిమిషాలకు మొదలుకానుంది.
తొలిసారి ఇలా..
పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మనీ స్టేడియం బయట జరగనుంది. ఇలా స్టేడియం బయట ఆరంభ వేడుకలు జరగడం ఒలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి. సీన్ నదీ తీరంలో ఈ సంబరం అట్టహాసంగా జరగనుంది. వీక్షకులతో పారిస్ వీధులు కిక్కిరిసిపోనున్నాయి. విభిన్నంగా జరగనున్న పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు.
లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్
పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలను ఇండియాలో స్పోర్ట్స్18 నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిజిటల్ విషయానికి వస్తే.. జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
ఫ్లాగ్ బేరర్‌గా సింధు
పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో భారత్ తరఫున ఫ్లాగ్ బేరర్లుగా స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగమ్మాయి పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ లెజెండ్ ఆచంట శరత్ కమల్ ఉండనున్నారు. భారత బృందానికి ఈ వేడుకలో సారథ్యం వహించనున్నారు. పీవీ సింధు 2016 ఒలింపిక్ క్రీడల్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించారు. ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉన్నారు.
భారత అథ్లెట్లు
పారిస్ ఒలింపిక్స్‌లో 16 క్రీడా పోటీల్లో 117 మంది భారత అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. గత టోక్యో ఒలింపిక్ క్రీడల్లో భారత్ 7 పతకాలు సాధించింది. అయితే, ఆసారి భారత్ పతకాల సంఖ్య రెండెంకలు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.
భారత పోటీ షురూ.. నేటి షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత పోరును ఆర్చర్లు షురూ చేయనున్నారు. నేడు (జూలై 25) ఆర్చరీ మహిళల, పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్స్ రౌండ్లలో భారత అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ మహిళల ఆర్చరీ ఈవెంట్ మధ్యాహ్నం 1 గంటలకు మొదలుకానుంది. పురుషుల ఆర్చరీ ఈవెంట్ సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు మొదలుకానుంది. అంతర్జాతీయ టోర్నీలో భారత ఆర్చర్లు రాణిస్తున్నా.. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం రాలేదు. అయితే, ఈసారి కచ్చితంగా ఆర్చరీలో మెడల్స్ వస్తాయనే ఆశలు ఉన్నాయి.
పారిస్ ఒలింపిక్స్ 2024 టోర్నీ ఆగస్టు 11వ తేదీ వరకు జరగనున్నాయి. 32 క్రీడల్లో 329 ఈవెంట్లు జరగనున్నాయి. సుమారు 206 దేశాల నుంచి 10,714 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు.