Pv Sindhu: నా ఆట ఎలా ఉంటుందో చెప్పను.... కోర్టులోనే చూపిస్తా - హ్యాట్రిక్ మెడల్‌పై కన్నేసిన పీవీ సింధు
Pv Sindhu: ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ మెడల్ సాధించాలనే కసితో బరిలోకి దిగుతోంది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. ఈ సారి దూకుడుగా కంటే స్మార్ట్ గేమ్ ఆడటంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు సింధు తెలిపింది. తన ఆట ఎలా ఉంటుందన్నది కోర్టులోనే చూపిస్తానని చెప్పింది.
Pv Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకం ఆశలు రేపుతోన్న ప్లేయర్లలో బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు ప్లేయర్ పీవీ సింధు ఒకరు. ఇప్పటికే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ దక్కించుకున్నది పీవీ సింధు. గోల్డ్ మెడల్ మాత్రం ఆమెకు అందని ద్రాక్షగానే మిగిలింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఆ కలను నెరవేర్చుకోవాలని సింధు బరిలోకి దిగుతోంది. హ్యాట్రిక్ మెడల్‌ను ఖచ్చితంగా సాధిస్తానని సింధు ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ప్రతిసారి కొత్తే...
"ఒలింపిక్స్ ఆడటం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. క్వాలిఫై కావడం ఇదే ఫస్ట్ టైమ్ అనే ఎగ్జైట్‌మెంట్‌తో ఆడబోతున్నాను. 2016లో మొదటిసారి ఒలింపిక్స్ బరిలో దిగినప్పుడు నాపై ఎలాంటి అంచనాలు లేవు. నేను పతకం సాధిస్తానని ఎవరూ అనుకోలేదు. అండర్‌డాగ్‌గా బరిలో దిగి మెడల్ సాధించాను. టోక్యో ఒలింపిక్స్‌కు వచ్చే సరికి పరిస్థితి మొత్తం మారిపోయింది.
నేను పతకం గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ఓ అథ్లెట్‌గా నాపై అంచనాలు పెరిగిపోయాయి. ఒత్తిడిని జయిస్తూ పతకం సాధించడానికి చాలా కష్టపడ్డా. ఓ ప్లేయర్‌గా రెండు రకాల అనుభవాలను చూడటం మేలు చేసింది. ఈ సారి కూడా స్వేచ్ఛగా ఆడుతూ పతకం సాధించాలని ఫిక్సయ్యా. తప్పకుండా హ్యాట్రిక్ మెడల్ గెలుస్తాననే నమ్మకముంది" అని పీవీ సింధు తెలిపింది.
బెంగళూరులో ట్రైనింగ్...
ఒలింపిక్స్ కోసం పీవీ సింధు బెంగళూరులో కఠిన శిక్షణను తీసుకున్నది. సుదీర్ఘ ర్యాలీ, ఎటాకింగ్ గేమ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ట్రైనింగ్‌లో జర్మన్ సింగిల్స్ ప్లేయర్‌తో పాటు నైజీరియా బ్యాడింటన్ ఆటగాడు తనకు ఎంతో సహాయసహకారాలు అందించారని సింధుతెలిపింది. ఒక్కో సారి ట్రైనింగ్‌లో ఇద్దరు, ముగ్గురు ప్రత్యర్థులతో గేమ్ ఆడానని, ఆ శిక్షణ ఒలింపిక్స్‌లో తనకు ఎంతగానో ఉపకరిస్తుందని సింధు తెలిపింది.
దూకుడు కాదు...స్మార్ట్ గేమ్...
"కోర్టులో దూకుడుగా కంటే తెలివిగా ఆడటం చాలా ముఖ్యం. ప్రత్యర్థి ఆటకు తగ్గట్లుగా ఏ టైమ్‌కు ఏ షాట్ ఆడాలి, ఓవర్‌హెడ్, ఫోర్‌హ్యాండ్‌తో పాటు మిగిలిన స్ట్రోక్ట్స్‌కు ఎప్పుడు కొట్టాలనేదానిపై ప్రకాష్ పదుకోణ్‌తో పాటు కోచ్ అగస్ కూడా ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని సింధు అన్నది. గేమ్స్ ప్లాన్స్ ఎప్పటికప్పుడు ఛేంజ్ చేస్తూ స్మార్ట్ గా ఆడటంపైనే దృష్టిసారించాను. ఈ సారి నా ఆటలో ఎలాంటి మార్పుల ఉంటాయన్నది చెప్పను. కోర్టులోనే అందరికి చూపిస్తాషనని సింధు తెలిపింది.
ఫ్లాగ్ బేరర్‌గా..
నేటి రాత్రి జరుగనున్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత జట్టుకు పీవీ సింధు ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరిస్తోంది. ఆచంట శరత్‌కమల్‌తో కలిసి జాతీయ పతాకాన్ని చేతబట్టి అథ్లెట్లను ముందుకు నడిపించబోతున్నది. ఇవి తనకు ఎంతో గర్వ కారణమైన క్షణాలని సింధు తెలిపింది.
2016 ఒలింపిక్స్‌లో సింధు సిల్వర్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాండ్ మెడల్‌ను సింధు గెలుచుకున్నది. ఈ సారి పతకం సాధిస్తే వరుసగా మూడో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన ఫస్ట్ ప్లేయర్‌గా సింధు నిలుస్తుంది.