Paris Olympics in Numbers: పారిస్ ఒలింపిక్స్.. నంబర్స్‌లో ఇండియా.. మొత్తం ఎంతమందో తెలుసా?
Paris Olympics in Numbers: పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మరి ఇందులో ఇండియన్ అథ్లెట్లు ఎంతమంది, ఎన్ని మెడల్స్ కోసం పోటీ పడుతున్నారు? ఇతర ఆసక్తి రేపే నంబర్లు చూడండి.
Paris Olympics in Numbers: పారిస్ ఒలింపిక్స్ వచ్చేశాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా కోట్లాది మంది భారతీయుల ఆశలను మోస్తూ ఇండియన్ అథ్లెట్లు మెడల్స్ వేట కోసం వెళ్లారు. శుక్రవారం (జులై 16) ఓపెనింగ్ సెర్మనీతో గేమ్స్ ప్రారంభం కానుండగా.. గురువారం (జులై 25) నుంచే ఆర్చరీలాంటి ఈవెంట్లలో ఇండియన్ అథ్లెట్లు పాల్గొంటున్నారు. గత ఒలింపిక్స్ లో 7 మెడల్స్ సాధించిన మన అథ్లెట్లు ఈసారి ఎన్ని తెస్తారో చూడాలి.
పారిస్ ఒలింపిక్స్ నంబర్లలో..
117 - పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనబోయే మొత్తం ఇండియన్ అథ్లెట్ల సంఖ్య ఇది. గత ఒలింపిక్స్ లో 124 మంది పాల్గొనగా ఈసారి ఏడుగురు తగ్గారు.
95 - ఇండియన్ అథ్లెట్లు పోటీ పడనున్న మొత్తం మెడల్స్ సంఖ్య ఇది
69 - పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ అథ్లెట్లు పోటీ పడుతున్న మొత్తం ఈవెంట్ల సంఖ్య
61 - పారిస్ లోనే తొలిసారి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న ఇండియన్ అథ్లెట్ల శాతం ఇది. 72 మంది అథ్లెట్లు తొలిసారి ఒలింపిక్స్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
44 - మొత్తం ఇండియన్ టీమ్ లో అత్యంత పెద్ద వయసు అథ్లెట్ వయసు ఇది. టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న వయసు ఇది. అతడు తన మూడో ఒలింపిక్స్ ఆడబోతున్నాడు.
29 - పారిస్ లో అత్యధికంగా అథ్లెటిక్స్ లో 29 మంది ఇండియన్ అథ్లెట్లు పాల్గొంటున్నారు.
21 - పారిస్ ఒలింపిక్స్ లో అత్యధికంగా ఇండియన్ షూటింగ్ టీమ్ సాధించిన కోటా సంఖ్య ఇది. ప్రతి కేటగిరీలోనూ కనీసం ఒక ఇండియన్ షూటర్ ఉండటం ఇదే తొలిసారి.
16 - ఇండియన్ అథ్లెట్లు పోటీ పడుతున్న క్రీడాంశాల సంఖ్య ఇది
14 - పారిస్ గేమ్స్ లో అత్యంత పిన్న వయసు అథ్లెట్ ఏజ్ ఇది. స్విమ్మర్ ధినిధి దేశింగు 1952 నుంచి ఇండియా తరఫున పాల్గొంటున్న అత్యంత పిన్న వయసు అథ్లెట్ గా నిలిచింది.
8 - ఇండియా పోటీ పడుతున్న మొత్తం 16 క్రీడల్లో ఇప్పటి వరకు మెడల్స్ అందించిన క్రీడల సంఖ్య ఇది
5 - గతంలో మెడల్స్ గెలిచి పారిస్ గేమ్స్ ఆడుతున్న ఇండియన్ అథ్లెట్ల సంఖ్య - నీరజ్ చోప్రా, పీవీ సింధు, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గొహైన్, ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ గతంలో మెడల్స్ గెలిచాయి.
2 - ఒకటి కంటే ఎక్కువ వ్యక్తిగత ఈవెంట్లలో పాల్గొంటున్న ఇండియన్ అథ్లెట్ల సంఖ్య. పరుల్ చౌదరి వుమెన్స్ 5 వేల మీటర్ల పరుగు, 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్లలో పాల్గొననుండగా.. మను బాకర్ వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో పాల్గొననుంది.
1 - ప్రస్తుత టీమ్ లో ఒకటి కంటే ఎక్కువ ఒలింపిక్స్ లో మెడల్స్ గెలిచిన అథ్లెట్ పీవీ సింధు ఒక్కరే. వరుసగా మూడో ఒలింపిక్స్ లో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాలని ఆమె చూస్తోంది.