Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ ఫ్లాగ్ బేరర్‌గా పీవీ సింధు - 32 గేమ్స్‌లో ఇండియా అర్హత సాధించింది పదహారే!
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల టీమ్‌కు పీవీ సింధుతో పాటు టీటీ ప్లేయర్ ఆచంట శరత్ కమర్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నారు. ఒలింపిక్స్‌లో ఇండియా నుంచి 111 మంది క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో పోటీపడుతోన్నారు.
Paris Olympics: తెలుగు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఒలింపిక్ టీమ్‌కు పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుంది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత అథ్లెట్లతో కూడిన బృందానికి పీవీ సింధుతో పాటు టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించనున్నారు.
జాతీయ పతాకన్ని చేతపట్టుకొని మన దేశ క్రీడాకారులను పీవీ సింధు, శరత్ కమల్ ముందుండి నడిపించనున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో సింధు, శరత్‌కుమార్ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించనున్న విషయాన్ని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ పీటీ ఉష తెలిపింది.
శరత్ ఒక్కడే అనుకున్నారు కానీ...
భారత అథ్లెట్ల బృందానికి ఫ్లాగ్ బేరర్‌గా శరత్ కమల్ వ్యవహరిస్తాడని చాలా రోజుల క్రితమే ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రకటించింది. కానీ క్రీడల్లో లింగ వివక్షను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ సారి ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రతి దేశం నుంచి ఒక్కో పురుష, మహిళా క్రీడాకారుడు ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించాలని ఒలింపిక్స్ కమిటీ నిర్ణయించింది. ఈ నిబంధనను దృష్టిలో పెట్టుకొని పీవీ సింధుతో పాటు శరత్ కమల్‌ను ఫ్లాగ్ బేరర్స్‌గా ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.
సింధు మూడో పతకం...
ఒలింపిక్స్‌లో సింధు ఇప్పటివరకు రెండు పతకాలు సాధించింది. 2016 ఒలింపిక్స్‌లో సిల్వర్, 2020 ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నది. ఇప్పటివరకు స్వర్ణం మాత్రం గెలవలేకపోయింది. గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు బరిలోకి దిగుతోంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు పతకం గెలిచే అవకాశం ఉన్న క్రీడాకారుల్లో ఒకరిగా సింధుపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఐదో ఒలింపిక్స్...
మరోవైపు ఆంచట శరత్ కమల్‌కు ఇది ఐదో ఒలింపిక్స్. కామన్‌వెల్త్, ఆసియా క్రీడల్లో పలు పతకాలు సాధించిన శరత్‌కమల్ ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో మాత్రం మెడల్ గెలవలేకపోయాడు. టీటీ ప్లేయర్‌గా అతడికి ఇదే చివరి ఒలింపిక్స్ కావడంతో పతకం గెలిచి ఘనంగా రిటైర్‌మెంట్ ప్రకటించాలని శరత్ కమల్ ఎదురుచూస్తున్నాడు.
32 గేమ్స్...16 అర్హత...
పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల బృందానికి చెఫ్ డే మిషన్‌గా మేరీ కోమ్ స్థానంలో గగన్ నారంగ్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నియమించింది. వ్యక్తిగత సమస్యలతో మేరీ కోమ్ ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్ల జాబితాను ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. ఒలింపిక్స్‌లో మొత్తం 32 గేమ్స్ ఉండగా ఇందులో పదహారు క్రీడాంశాల్లో 111 మంది అథ్లెట్లు భారత నుంచి పోటీపడుతోన్నారు.
గత ఏడాది ఒలింపిక్స్‌కు 124 మంది భారత ప్లేయర్లు అర్హత సాధించారు. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ సారి తక్కువ మంది భారత క్రీడాకారులు విశ్వ క్రీడలకు అర్హత సాధించారు. జిమ్నాస్టిక్‌తో పాలు పలు క్రీడాంశాల్లో భారత్ నుంచి ఒక్క ప్లేయర్ కూడా అర్హత సాధించలేదు.