Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌-achanta sharath kamal to be india flag bearer in paris olympics ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 22, 2024 08:17 AM IST

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో జాతీయ ప‌తాక ధారిగా టేబుల్ టెన్సిస్ ప్లేయ‌ర్ ఆచంట శ‌ర‌త్ క‌మ‌ల్ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. ఇండియ‌న్ టీమ్‌కు మెంట‌ర్‌గా దిగ్గ‌జ బాక్స‌ర్ మేరికోమ్ ఎంపికైంది.

ఆచంట శ‌ర‌త్ క‌మ‌ల్
ఆచంట శ‌ర‌త్ క‌మ‌ల్

Achanta Sharath Kamal: 2024 ఒలింపిక్స్ క్రీడ‌లు పారిస్ వేదిక‌గా జూలై - ఆగ‌స్ట్ నెల‌ల్లో జ‌రుగ‌నున్నాయి. జూలై 26న ఈ విశ్వ‌క్రీడ‌లు మొద‌లుకాబోతున్నాయి. ఆగ‌స్ట్ 11 వర‌కు మొత్తం ప‌దిహేను రోజుల పాటు ఒలింపిక్స్‌ గేమ్స్ జ‌రుగ‌నున్నాయి. ఈ పారిస్ ఒలింపిక్స్ క్రీడ‌ల్లో భార‌త జ‌ట్టు జాతీయ ప‌తాక‌ధారిగా టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్ ఆచంట శ‌ర‌త్ క‌మ‌ల్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఫ్లాగ్‌బేర‌ర్‌గా శ‌ర‌త్‌క‌మ‌ల్‌ను భార‌త ఒలింపిక్స్ అసోషియేష‌న్ ఎంపిక‌చేసింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్స‌వ వేడుక‌ల్లో జాతీయ ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ క‌నిపించ‌బోతున్నాడు.

ఫ్లాగ్ బేర‌ర్‌గా...

ఆచంట శ‌ర‌త్‌క‌మ‌ల్‌కు ఇవి ఐదో ఒలింపిక్స్‌. ఇవే త‌న చివ‌రి ఒలింపిక్స్ క్రీడ‌లు అని శ‌ర‌త్ క‌మ‌ల్ ప్ర‌క‌టించాడు.చివ‌రి ఒలింపిక్స్‌లో ఫ్లాగ్ బేర‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. ఒలింపిక్స్ క్రీడ‌ల్లో ప‌తాక‌ధారులుగా ఇప్ప‌టివ‌ర‌కు చాలా త‌క్కువ మంది టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్స్ వ్య‌వ‌హ‌రించారు.

అలాంటి అరుదైన ఘ‌న‌త‌ త‌న‌కు ద‌క్క‌నుండ‌టం ఆనందంగా ఉంద‌ని శ‌ర‌త్ క‌మ‌ల్ తెలిపాడు. 2022 కామెన్‌వెల్త్ గేమ్స్ ముగింపు వేడుక‌ల్లో భార‌త ప‌తాక‌ధారిగా శ‌ర‌త్‌క‌మ‌ల్ వ్య‌వ‌హ‌రించాడు. కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో శ‌ర‌త్ క‌మ‌ల్ మూడు గోల్డ్ మెడ‌ల్స్ అందుకున్నాడు. ఒలింపిక్స్‌లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ప‌తకం కూడా గెల‌వ‌లేక‌పోయాడు.

మేరీ కోమ్‌...

అలాగే భార‌త ఒలింపిక్ టీమ్ హెడ్‌గా దిగ్గ‌జ బాక్స‌ర్ మేరీకోమ్‌ను నియ‌మితురాలైంది. మేరీ కోమ్‌ను చెఫ్ డి మిష‌న్‌గా భార‌త ఒలింపిక్ అసోసియేష‌న్ ప్ర‌క‌టించింది. భార‌త టీమ్‌కు మెంట‌ర్‌గా, గైడ్‌గా మేరీ కోమ్ వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, ఆమె అనుభ‌వం, స‌ల‌హాలు జ‌ట్టుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఒలింపిక్ అసోసియేష‌న్ ప్ర‌క‌టించింది. 2012 ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ కాంస్య ప‌తకం గెలిచింది. ఆరు సార్లు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌గా నిలిచింది.

షూటింగ్ నుంచి 19 మంది...

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త షూటింగ్ బృందానికి స‌ల‌హాదారుడిగా బ్రాంజ్ మెడ‌లిస్ట్ గ‌గ‌న్ నారంగ్ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు పారిస్ ఒలింపిక్స్‌లో కేవ‌లం షూటింగ్ నుంచే 19 మంది బెర్తులు క‌న్ఫామ్ చేసుకున్నారు. ఇండియా నుంచి అత్య‌ధిక మంది షూట‌ర్స్ ఒలింపిక్స్ బెర్తుల‌ను ద‌క్కించుకోవ‌డం ఇదే తొలిసారి.మేరీకోమ్‌, శ‌ర‌త్ క‌మ‌ల్‌, గ‌న‌న్ నారంగ్‌కు ఆయా క్రీడల్లో ఉన్న అనుభ‌వం, ప్ర‌తిభ‌తో పాటు వారి నాయ‌క‌త్వ ప‌ఠిమ‌ను దృష్టిలో పెట్టుకొని ఈ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించిన‌ట్లు ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ పీటీ ఉష‌ తెలిపింది. వారి మార్గ‌ద‌ర్శ‌నంలో పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా అద్భుత‌మైన ఫ‌లితాల్ని సాధిస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని పీటీ ఉష చెప్పింది.

Whats_app_banner

టాపిక్