India Shooting Team for Paris Olympics: ఇండియన్ షూటర్ల కొత్త రికార్డు.. పారిస్ ఒలింపిక్స్‌కు 16 మంది
India Shooting Team for Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ కు రికార్డు స్థాయిలో 16 మంది షూటర్లను పంపించనుంది ఇండియా. గతంలో ఎప్పుడూ ఇంత మంది షూటర్లు అర్హత సాధించలేదు.
India Shooting Team for Paris Olympics: ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ కు రికార్డు స్థాయిలో 16వ ఇండియన్ షూటర్ అర్హత సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న ఏషియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ రైఫిల్/పిస్టల్ లో 25 మీటర్ల పిస్టల్ కేటగిరీలో రిథమ్ సాంగ్వాన్ బ్రాంజ్ మెడల్ గెలిచింది. దీంతో ఆమె పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
ఇప్పటికే 15 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించగా.. రిథమ్ 16వ షూటర్ గా నిలిచింది. ఇప్పటి వరకూ అత్యధికంగా 15 మంది షూటర్లు మాత్రమే ఇండియా తరఫున ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించారు. టోక్యో ఒలింపిక్స్ లో ఈ రికార్డు నెలకొల్పగా.. తాజాగా పారిస్ లో ఆ రికార్డు బ్రేక్ కానుంది. జకార్తాలో జరుగుతున్న ఈ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ లో రిథమ్ కు ఇది మూడో మెడల్ కావడం విశేషం.
ఇంతకు ముందు ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో సిల్వర్ మెడల్ గెలిచింది. తాజా ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ తోపాటు ఇండియా తరఫున ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ ఈవెంట్ తర్వాత రిథమ్ చెప్పింది. గతంలో రెండుసార్లు ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోయిన ఆమె.. ఈసారి సాధించింది.
588 పాయింట్లతో 25 మీటర్ల పిస్టల్ కేటగిరీలో ఫైనల్ కు అర్హత సాధించిన రిథమ్.. ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ఇక 25 మీటర్ల వుమెన్స్ పిస్టల్ టీమ్ ఈవెంట్లోనూ ఇండియా సిల్వర్ మెడల్ గెలిచింది. దీంతో 8 గోల్డ్, 7 సిల్వర్, ఆరు బ్రాంజ్ మెడల్స్ తో చైనాను వెనక్కి నెట్టి ఇండియా టాప్ లో నిలవడం విశేషం.
2022లో బాకులో రుద్రాంక్ష్ పాటిల్, స్వాప్నిల్ కుశాలె ఇండియా తరఫున పారిస్ ఒలింపిక్స్ కు తొలి రెండు స్థానాలను భర్తీ చేశారు. ఈ ఇద్దరూ మెన్స్ ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో వీళ్లు అర్హత సాధించారు. ఇక 2023లో మరో 10 మంది పారిస్ ఒలింపిక్స్ బెర్త్ కన్ఫమ్ చేసుకున్నారు. ఇక 2024 ప్రారంభమైన తర్వాత రిథమ్ తో కలిపి నలుగురు అర్హత సాధించారు.