New Sports in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్.. అనుకూలంగా ఓటింగ్: మరో నాలుగు క్రీడలు కూడా..
Cricket in Olympics: 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరగడం ఖరారైంది. ఇందుకు ఓటింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. మరో నాలుగు క్రీడలు కూడా విశ్వక్రీడల్లో అడుగుపెట్టనున్నాయి.
Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్ మళ్లీ అడుగుపెట్టబోతోంది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడ్లలో క్రికెట్ పోటీలు కూడా జరగనున్నాయి. ఈ విషయంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అధికారిక ప్రకటన చేసింది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‍ను చేర్చేందుకు సోమవారం (అక్టోబర్ 16) జరిగిన ఓటింగ్‍లో ఐఓసీ సభ్యులు అనుకూలంగా ఓటేశారు. ముంబైలో ఐఓసీ కమిటీ సమావేశాలు జరిగాయి. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‍తో పాటు బేస్‍బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్‍బాల్, స్క్వాష్, లాక్రోస్ క్రీడలను కూడా చేర్చేందుకు ఐఓసీ ఆమోదం తెలిపింది. దీంతో 2028 విశ్వక్రీడల్లో క్రికెట్‍తో పాటు మరో నాలుగు క్రీడలు చేరనున్నాయి. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‍ను చేర్చేందుకు ఐఓసీ ఇటీవలే నిర్ణయించుకున్నా.. అందుకు ఓటింగ్ నేడు జరగటంతో ప్రక్రియ పూర్తయింది.
2028 ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల క్రికెట్ టీ20 ఫార్మాట్‍లో జరగనుంది. ఆరు జట్లతో క్రికెట్ పోటీలను నిర్వహించాలని ప్రస్తుతానికి లాస్ ఏంజిల్స్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక 2028 క్రీడల కోసం మరో ఐదు క్రీడలను చేర్చినట్టు ఐఓసీ అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. “ఒలింపిక్ గేమ్స్ లాస్ ఏంజిల్స్ 2028లో ఐదు కొత్త క్రీడలను చేర్చే ప్రతిపాదనను ఐఓసీ సెషన్ ఆమోదించింది. బేస్‍బాల్/సాఫ్ట్ బాల్, క్రికెట్ (టీ20), ఫ్లాగ్ ఫుట్‍బాల్, లాక్రోస్ (సిక్సెస్), స్క్వాష్ కూడా లాస్‍ఏంజిల్స్ 2028 క్రీడల్లో ఉంటాయి” అని ఐఓసీ మీడియా ట్వీట్ చేసింది.
దీంతో, సుమారు 128 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో చివరిసారిగా క్రికెట్ జరిగింది. తదుపరి 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ అడుగుపెట్టనుంది.
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‍ను చేర్చడం పట్ల ఐఓసీ మెంబర్ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్ ఒక గేమ్ కాదని, అదో మతం అని అని అన్నారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‍ను చేర్చడం పట్ల ఓ భారతీయురాలిగా చాలా సంతోషిస్తున్నానని ఆమె అన్నారు.
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరగనుండటంతో ఈ విభాగంలో భారత్‍కు పతకం వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది. ఇది ఇండియాకు సానుకూలంగా ఉండనుంది. అలాగే, భారత్, పాకిస్థాన్‍తో పాటు దక్షిణాసియా ప్రజల్లో ఒలింపిక్స్‌పై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అలాగే, క్రికెట్ మరిన్ని దేశాలకు విస్తరించే ఛాన్స్ కూడా ఉంటుంది.