RCB vs GT: కోహ్లి సెంచరీ వృథా - ప్లేఆఫ్స్ రేసు నుంచి బెంగళూరు ఔట్
RCB vs GT: గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైన బెంగళూరు ఐపీఎల్ నుంచి ఇంటి బాటపట్టింది. గిల్ మెరుపు శతకంతో చెలరేగడంతో బెంగళూరుపై గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లి సెంచరీ వృథాగా మారింది.
RCB vs GT: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు పోరాడినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. కీలక మ్యాచ్‌లో ఓటమి పాలై లీగ్‌దశలోనే ఐపీఎల్ 2023 నుంచి నిష్క్రమించింది. శుభ్‌మన్ గిల్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
కోహ్లి సెంచరీతో ఆకట్టుకున్నా బెంగళూరును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 197 రన్స్ చేసింది. కోహ్లి సెంచరీతో చెలరేగి బెంగళూరుకు భారీ స్కోరు అందించాడు. 61 బాల్స్‌లో పదమూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. డుప్లెసిస్ 28, బ్రాస్‌వెల్ 26 రన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన విరాట్ చివరి ఐదు ఓవర్లలో జోరు పెంచాడు.
వరుస ఫోర్లతో రెచ్చిపోయి సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ సీజన్‌లో కోహ్లికి ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై కోహ్లి సెంచరీ చేశాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీసుకున్నాడు. 198 పరుగుల టార్గెట్‌తో ఛేదనను ఆరంభించిన గుజరాత్ ఆరంభంలోనే సాహా వికెట్‌ను కోల్పోయింది.
కానీ శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్ ధనాధన్ బ్యాటింగ్‌తో గుజరాత్‌ను అదిరిపోయే విజయాన్ని అందించాడు. శుభ్‌మన్ గిల్ సెంచరీతో రాణించి బెంగళూరు ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. 52 బాల్స్‌లోనే ఎనిమిది సిక్సర్లు, ఐదు ఫోర్లతో 104 రన్స్ చేశాడు. విజయ్ శంకర్ (35 బాల్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 రన్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి జోరుతో మరో ఐదు బాల్స్ మిగిలుండగానే గుజరాత్ టార్గెట్‌ను చేరుకుంది.
చివరలో బెంగళూరు బౌలర్లు సిరాజ్, హర్షల్ పటేల్ వరుసగా వికెట్లు తీసి గుజరాత్‌ను భయపెట్టారు. కానీ గిల్ మాత్రం వారికి మరో ఛాన్స్ ఇవ్వకుండా మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరును గెలిపించాడు.
బెంగళూరు ఇంటికి - ముంబై ప్లేఆఫ్స్‌కి
గుజరాత్ చేతిలో ఓటమితో బెంగళూరు ఐపీఎల్ 2023 నుంచి ఇంటి బాట పట్టి మరోసారి అభిమానులను నిరాశపరిచింది. గుజరాత్‌పై గెలిస్తే రన్‌రేట్ ప్రతిపాదికన ముంబైని వెనక్కి నెట్టి బెంగళూరు ప్లేఆఫ్స్ కు వెళ్లేది. కానీ కీలక మ్యాచ్‌లో ఓటమితో బెంగళూరు ఇంటి బాట పట్టగా ముంబై ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టింది.