తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Nz In Hyderabad: హైదరాబాద్‌లో ఇండియా, న్యూజిలాండ్‌ వన్డే.. టికెట్ల అమ్మకాలు ఆ రోజు నుంచే..

Ind vs NZ in Hyderabad: హైదరాబాద్‌లో ఇండియా, న్యూజిలాండ్‌ వన్డే.. టికెట్ల అమ్మకాలు ఆ రోజు నుంచే..

Hari Prasad S HT Telugu

11 January 2023, 19:39 IST

google News
    • Ind vs NZ in Hyderabad: హైదరాబాద్‌లో ఇండియా, న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టికెట్ల అమ్మకాలతోపాటు మ్యాచ్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజారుద్దీన్‌ బుధవారం (జనవరి 11) మీడియాకు వెల్లడించారు.
హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం
హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (PTI)

హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం

Ind vs NZ in Hyderabad: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. వచ్చే బుధవారం (జనవరి 18) న్యూజిలాండ్‌తో ఇండియా వన్డే మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదిక కానుంది. గతేడాది ఇక్కడే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

అయితే ఆ మ్యాచ్‌ సమయంలో టికెట్ల అమ్మకాలపై ఆరోపణలు, అభిమానులపై లాఠీఛార్జ్‌లాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. దీంతో ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందుకే ఈసారి టికెట్ల అమ్మకాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో జరపాలని నిర్ణయించినట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ వెల్లడించారు.

బుధవారం (జనవరి 11) ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న వన్డే మ్యాచ్‌ ఇది. ఈ మ్యాచ్‌ను సజావుగా నిర్వహించడానికి హెచ్‌సీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక టికెట్ల అమ్మకాలను పూర్తి ఆన్‌లైన్‌లో జరపాలని నిర్ణయించినట్లు అజర్‌ తెలిపారు. అయితే మ్యాచ్‌కు వచ్చే సమయంలో మాత్రం ఫిజికల్‌ టికెట్‌ తప్పనిసరి అని చెప్పారు.

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న తర్వాత జనవరి 15 నుంచి 18 వరకూ ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎల్బీ స్టేడియంతోపాటు గచ్చిబౌలి స్టేడియంలలో ఏర్పాటు చేసే కౌంటర్లలో ఆ టికెట్లను తీసుకోవాలని సూచించారు. ఇక బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలు జరగకుండా కూడా తాము చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు కూడా రోజువారీ పరిమితితో జరగనున్నాయి. జనవరి 13 నుంచి 16 వరకూ ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. 13వ తేదీన 6 వేల టికెట్లు, 14న 7 వేల టికెట్లు, 15న 7 వేల టికెట్లు, 16న మిగిలిన టికెట్లను అమ్మకానికి ఉంచనున్నారు. ఉప్పల్‌ స్టేడియం పూర్తి సామర్థ్యం 39112. అందులో హెచ్‌ఏసీ కాంప్లిమెంటరీల రూపంలోనే 9695 టికెట్లు ఇవ్వనుంది. మిగిలిన 29417 టికెట్లను మాత్రమే అమ్మకానికి ఉంచనున్నారు.

ఆన్‌లైన్‌లో గరిష్ఠంగా ఒక్కొక్కరికి 4 టికెట్లు మాత్రమే కొనుగోలు చేసే వీలుంటుంది. ఇక ఈ నెల 14న మొదటగా న్యూజిలాండ్‌ టీమ్‌ హైదరాబాద్‌ చేరుకోనుంది. మరుసటి రోజు ఆ టీమ్‌ ఉప్పల్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తుంది. ఇక ఈ నెల 15న శ్రీలంకతో చివరి వన్డే ఆడిన తర్వాత 16న ఇండియన్‌ టీమ్‌ హైదరాబాద్ వస్తుంది.

తదుపరి వ్యాసం