Hyderabad Cricket Association Controversies: వివాదాలు, వైఫల్యాలకు కేరాఫ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
Hyderabad Cricket Association Controversies: వివాదాలు, వైఫల్యాలకు మొదటి నుంచీ కేరాఫ్‌గా నిలుస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. తాజాగా టికెట్ల అమ్మకాల వైఫల్యంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
Hyderabad Cricket Association Controversies: హైదరాబాద్ క్రికెట్‌కు ఘనమైన చరిత్రే ఉంది. ఒకప్పటి ఎంఎల్ జయసింహ నుంచి ఇప్పటి మహ్మద్ సిరాజ్ వరకూ ఎంతో మంది గొప్ప క్రికెటర్లను దేశానికి అందించిన చరిత్ర భాగ్యనగరానికి ఉంది. నిజానికి ఎంతో మంది టాలెంటెడ్ ఆటగాళ్లు అడపాదడపా వస్తున్నా.. ఇక్కడి క్రికెట్ అసోసియేషన్ పనితీరు సరిగా లేక వెలుగులోకి రాలేకపోతున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరు వినగానే అంతర్గత కుమ్ములాటలు, వివాదాలు, వైఫల్యాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఈ అసోసియేషన్‌లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇండియన్ క్రికెట్ టీమ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన మహ్మద్ అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
టికెట్లూ సరిగా అమ్మలేక..
తాజాగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లోనూ హెచ్‌సీఏ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. అసలు టికెట్ల అమ్మకాల విషయంలో స్పష్టత లేకపోవడం తీవ్ర గందరగోళానికి దారి తీసి.. అది కాస్తా అభిమానుల పాలిట శాపంగా మారింది. సుమారు మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతుండటంతో దీనికి ఫుల్ డిమాండ్ ఉంటుందని ఎవరైనా ఊహించగలరు.
కానీ ఆ డిమాండ్‌ను సరిగా అంచనా వేయలేకపోగా.. టికెట్ల అమ్మకాల విషయంలోనూ మాట మార్చింది. మొదట ఆన్‌లైన్‌లోనే మొత్తం టికెట్లు అమ్మేసినట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. పేటీఎం ద్వారా వీటిని విక్రయించగా.. నిమిషాల్లోనే వేల టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పారు. దీంతో వేల మంది ఫ్యాన్స్ ఉసూరుమన్నారు.
జింఖానా దగ్గర ఏం జరిగింది?
కానీ బుధవారం (సెప్టెంబర్ 21) ఆఫ్‌లైన్‌లో టికెట్లు అమ్ముతున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున జింఖానా గ్రౌండ్‌కు తరలి వచ్చారు. చివరికి గురువారం (సెప్టెంబర్ 22) ఉదయం నుంచి సాయంత్రం వరకూ టికెట్ల అమ్మకాలు చేపడుతున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. అయితే ఆఫ్‌లైన్లో కేవలం మూడు వేల టికెట్లు మాత్రమే ఉంచింది. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ తీసుకురావాలని, ఒక్కరికి రెండు కంటే ఎక్కువ టికెట్లు ఇవ్వబోమని చెప్పింది. కానీ ఈ 3 వేల టికెట్ల కోసం అంతకు పది రెట్ల మంది అభిమానులు గురువారం తెల్లవారుఝాము నుంచి వచ్చి పడిగాపులు కాశారు.
తీరా అమ్మకాలు మొదలు పెట్టే సమయానికి ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. లాఠీఛార్జ్ చేసే పరిస్థితి నెలకొంది. పదుల సంఖ్యలో అభిమానులు గాయపడ్డారు. ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మొత్తం గందరగోళంలో హెచ్‌సీఏ వైఫల్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో 39 వేల మంది మ్యాచ్ చూసే వీలుండగా.. వీటిలో 9 వేలు కాంప్లిమెంటరీ పాస్‌ల రూపంలోనే ఇవ్వాల్సిన పరిస్థితి. మిగిలిన 30 వేల టికెట్లకూ సరైన లెక్కల్లేవు.
చాలా వరకూ టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. సుమారు 10 వేల నుంచి 12 వేల టికెట్లపై క్లారిటీ లేదు. హెచ్‌సీఏ వైఫల్యం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు కానీ.. అది కాస్తా వేల మంది క్రికెట్ అభిమానులకు శాపంగా మారింది. ఒకరిపై మరొకరి ఆరోపణలు, కుమ్ములాటలు, కోర్టు చుట్టూ తిరగడాలతో తరచూ వార్తల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడిలా టికెట్ల అమ్మకాల్లో వైఫల్యంతోనూ విమర్శలు ఎదుర్కొంటోంది.