Australia Beat India: గ్రీన్‌, వేడ్‌ మెరుపులు.. ఇండియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా-australia beat india in first t20 to take lead in the 3 match series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Australia Beat India In First T20 To Take Lead In The 3 Match Series

Australia Beat India: గ్రీన్‌, వేడ్‌ మెరుపులు.. ఇండియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

Hari Prasad S HT Telugu
Sep 20, 2022 10:34 PM IST

Australia Beat India: గ్రీన్‌, వేడ్‌ మెరుపులతో మొహాలీలో జరిగిన తొలి టీ20లో టీమిండియాను చిత్తు చేసింది ఆస్ట్రేలియా. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

ఆస్ట్రేలియాను గెలిపించిన మాథ్యూ వేడ్ మెరుపులు
ఆస్ట్రేలియాను గెలిపించిన మాథ్యూ వేడ్ మెరుపులు (PTI)

Australia Beat India: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20 ఫ్యాన్స్‌కు మంచి మజా అందించింది. ఈ భారీ స్కోర్ల మ్యాచ్‌లో చివరికి ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. టీ20ల్లో తన అత్యధిక చేజ్‌(209 రన్స్‌)ను నమోదు చేసిన వరల్డ్‌ ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియా.. 4 వికెట్లతో ఇండియాను చిత్తు చేసింది. మొదట్లో కామెరాన్‌ గ్రీన్‌ (30 బాల్స్‌లో 61), చివర్లో మాథ్యూ వేడ్‌(21 బాల్స్‌లో 45) మెరుపులు ఆస్ట్రేలియాకు కళ్లు చెదిరే విజయాన్ని సాధించి పెట్టాయి. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో కేవలం 17 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసినా.. మిగతా బౌలర్లు విఫలమవడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. స్టార్ బౌలర్లు భువనేశ్వర్, చహల్, హర్షల్ పటేల్ ఇండియా కొంప ముంచారు.

ట్రెండింగ్ వార్తలు

ఒక దశలో భారీ టార్గెట్‌ చేజింగ్‌లో 145 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయినా.. చివర్లో వేడ్‌, టిమ్‌ డేవిడ్‌ ఇండియా బౌలర్లను చితకబాదుతూ ఆసీస్‌కు విజయాన్ని అందించారు. 18 బాల్స్‌లో 40 రన్స్‌ అవసరమైన సమయంలో హర్షల్ పటేల్‌ వేసిన 18వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఆ తర్వాత భువనేశ్వర్‌ వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు మాథ్యూ వేడ్‌. దీంతో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 209 రన్స్‌ టార్గెట్‌ చేజ్‌ చేసింది.

209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కూడా ఎక్కడా తగ్గలేదు. భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతినే కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌ లాంగాఫ్‌ మీదుగా సిక్స్‌గా మలచి మంచి స్టార్ట్‌ ఇచ్చాడు. మరో ఓపెనర్‌ గ్రీన్‌ అయితే ఉమేష్‌ యాదవ్‌ వేసిన రెండో ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. ఈ ఇద్దరూ 3.3 ఓవర్లలోనే 39 రన్స్‌ జోడించారు. ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన అక్షర్‌ పటేల్‌ ఫించ్‌ (13 బాల్స్‌లో 22)ను ఔట్‌ చేశాడు.

అయితే ఆ తర్వాతే అసలు విధ్వంసం మొదలైంది. గ్రీన్‌, స్టీవ్‌ స్మిత్‌ చెలరేగి ఆడారు. ముఖ్యంగా తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన గ్రీన్‌ కేవలం 30 బాల్స్‌లోనే 61 రన్స్‌ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. స్మిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించిన తర్వాత గ్రీన్‌ కూడా అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.

ఆ వెంటనే స్మిత్‌ (24 బాల్స్‌లో 35), మ్యాక్స్‌వెల్‌ (1), జోష్‌ ఇంగ్లిస్‌ (17) కూడా ఔటవడంతో ఆస్ట్రేలియా 145 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మాథ్యూ వేడ్‌, టిమ్‌ డేవిడ్‌ మెరుపులతో ఆస్ట్రేలియా టీ20ల్లో అత్యధిక టార్గెట్‌ను చేజ్‌ చేసి విజయం సాధించింది.

హార్దిక్, రాహుల్ షో

అంతకుముందు టీమిండియా 6 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. చివరి మూడు బంతులను సిక్స్‌లుగా మలచి ఇండియాకు సెన్సేషనల్‌ ముగింపునిచ్చాడు హార్దిక్‌ పాండ్యా. అతడు చివరికి కేవలం 30 బాల్స్‌లోనే 71 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అటు కేఎల్‌ రాహుల్‌ కూడా 35 బాల్స్‌లోనే 55 రన్స్‌ చేశాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే లభించినా.. దానిని సద్వినియోగం చేసుకోలేదు కెప్టెన్‌ రోహిత్ శర్మ (11). ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి ఊపు మీద కనిపించిన రోహిత్‌.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్‌కోహ్లి (2) నిరాశపరిచాడు. అతడు ఎలిస్‌ బౌలింగ్‌లో వికెట్‌ పారేసుకున్నాడు. దీంతో ఇండియా 35 రన్స్‌కే ఇద్దరు టాప్ బ్యాటర్లను కోల్పోయింది.

అయితే ఈ దశలో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెలరేగి ఆడారు. కెప్టెన్‌, మాజీ కెప్టెన్‌ త్వరగానే ఔటైనా.. ఆ అడ్వాంటేజ్ ఆస్ట్రేలియాకు దక్కకుండా చూశారు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా స్ట్రైక్‌ రేట్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్‌.. ఈ మ్యాచ్‌లో ముందు చెప్పినట్లే చాలా మెరుగుపరచుకున్నాడు. కేవలం 32 బాల్స్‌లోనే టీ20ల్లో 18వ హాఫ్‌ సెంచరీ చేశాడు.

అయితే ఆ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 35 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55 రన్స్‌ చేసి ఔటయ్యాడు. అప్పటికే సూర్యతో కలిసి మూడో వికెట్‌కు 68 రన్స్‌ జోడించాడు. అటు సూర్య కూడా తనదైన స్టైల్లో చెలరేగి ఆడాడు. అయితే రాహుల్‌ ఔటైన కాసేపటికే 25 బాల్స్‌లో 46 రన్స్‌ చేసి ఔటయ్యాడు. సూర్య ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.

WhatsApp channel