Azharuddin on Tickets issue: మా తప్పేమీ లేదు: హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్
Azharuddin on Tickets issue: ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల అమ్మకాలు, తొక్కిసలాట, లాఠీఛార్జ్ ఘటనపై స్పందించారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్. ఇందులో తమ తప్పేమీ లేదని అన్నారు.
Azharuddin on Tickets issue: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ కోసం జరిగిన టికెట్ల అమ్మకం, తొక్కిసలాట, లాఠీఛార్జ్ ఘటన దురదృష్టకరమని అన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్. జింఖానా మైదానంలో జరిగిన ఘటనపై గురువారం (సెప్టెంబర్ 22) సాయంత్రం తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి అజర్ మీడియాతో మాట్లాడారు.
"రూమ్‌లో కూర్చొని చర్చించినంత సులువు కాదు ఓ మ్యాచ్ నిర్వహించడం. మేమే తప్పూ చేయలేదు. ఈ ఘటనలో గాయపడిన అభిమానులకు అండగా ఉంటాం. వాళ్ల బాగోగులు హెచ్‌సీఏ చూసుకుంటుంది. నేను టికెట్ల అమ్మకాలు, అందుబాటులో ఉన్న టికెట్ల వంటి వివరాలన్నీ మంత్రికి ఇస్తాను. ఆయనే ఏది తప్పో, ఏది ఒప్పో చెబుతారు" అని అజారుద్దీన్ చెప్పారు.
"సమస్యలు ఉంటాయి. మూడేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో అభిమానులు ఎగబడుతున్నారు. కానీ అందరూ చూడటం సాధ్యం కాదు కదా. శుక్రవారం మీడియాకు అన్ని వివరాలు ఇస్తాం. దాచడానికి ఏమీ లేదు. అదే సమయంలో మ్యాచ్ సజావుగా జరిగేలా చూడాలి" అని అజర్ స్పష్టం చేశారు. ఇక తన అధికారాలకు సుప్రీంకోర్టు కత్తెర వేసిందన్న వార్తలను అజర్ ఖండించారు.
ఇక టికెట్ల అమ్మకం ఘటనపై గురువారం ఉదయం తీవ్రంగా స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అజారుద్దీన్‌తో సమావేశం తర్వాత కాస్త శాంతించినట్లు కనిపించారు. "ప్రభుత్వం, హెచ్‌సీఏ అధికారుల మధ్య సమన్వయం లేదు అన్నది నిజమే. అయితే ఇది మళ్లీ రిపీట్ కాకుండా చూస్తాం" అని మంత్రి శ్రీనివాస్ అన్నారు. గురువారం జరిగిన ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతారని తెలిపారు.
బుధవారం సాయంత్రమే ఆఫ్‌లైన్‌లో టికెట్లు అమ్మాలని నిర్ణయించడంతో భారీ సంఖ్యలో అభిమానులు వచ్చినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి హెచ్‌సీఏకు స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ సజావుగా జరిపేందుకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పారు.