ICC ODI Rankings: వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన సిరాజ్
22 March 2023, 16:19 IST
ICC ODI Rankings: వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయాడు మహ్మద్ సిరాజ్. లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియాకు చెదిన జోష్ హేజిల్‌వుడ్ ఆ స్థానాన్ని ఆక్రమించాడు.
తాజా ర్యాంకుల్లో మూడోస్థానానికి పడిపోయిన సిరాజ్
ICC ODI Rankings: తాజా ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయాడు. అతడు మూడో ర్యాంకుకు దిగజారాడు. అతనితోపాటు ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా మూడోస్థానంలో ఉన్నాడు. ఇండియాతో జరుగుతున్న తొలి రెండు వన్డేల్లో స్టార్క్ రాణించిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా రెండో వన్డేలో అతడు ఐదు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో ఇండియాను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. సిరాజ్ స్థానంలో తాజా ర్యాంకుల్లో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ నంబర్ వన్ అయ్యాడు. మరోవైపు సిరాజ్ తొలి వన్డేలో 3 వికెట్లు తీసి ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించినా.. రెండో వన్డేలో కేవలం 3 ఓవర్లలోనే 37 పరుగులు ఇచ్చాడు.
ఈ ఏడాది జనవరిలో సిరాజ్ తొలిసారి వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకు అందుకున్నాడు. సుమారు 8 వారాల పాటు ఈ స్థానంలో కొనసాగిన సిరాజ్.. ఇప్పుడు మూడోస్థానానికి పడిపోయాడు. అటు ఇండియా టూర్ మొత్తానికీ దూరమైన హేజిల్‌వుడ్ మాత్రం ఆశ్చర్యకర రీతిలో నంబర్ వన్ అయ్యాడు. తన కెరీర్ లో ఇలా నంబర్ వన్ కావడం ఇదే తొలిసారి.
మరోవైపు తొలి వన్డేలో ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ షమి తాజా ర్యాంకుల్లో 28వ స్థానానికి చేరాడు. ఇక ఆ మ్యాచ్ లో 75 పరుగులతో రాణించిన కేఎల్ రాహుల్ కూడా మూడు స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్ కు చేరుకున్నాడు. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి ఐదు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.