Kohli on Sledging: ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెరుగుపడ్డారు.. స్లెడ్జింగ్ చేయట్లేదు.. కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Kohli on Sledging: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌పై స్పందంచారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలా వరకు మెరుగుపడ్డారని, ఇప్పుడు స్లెడ్జింగ్ చేయట్లేదని తెలిపాడు. ఐపీఎల్ కారణంగానే ఆటగాళ్ల మధ్య సోదరభావం పెరిగిందని స్పష్టం చేశాడు.
Kohli on Sledging: ఆస్ట్రేలియా-భారత్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగిన వాతావరణం ఇరు పక్షాల మధ్య హీట్‌గా ఉంటుంది. గతంలో ఎప్పుడు గమనించినా స్లెడ్జింగ్‌కు ఆస్ట్రేలియా పెట్టింది పేరు. ప్రత్యర్థి బ్యాటర్లను ఏకాగ్రతను చెడగొట్టేందుకు వారిని కించపరిచేలా మాట్లాడటమో, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తరతూ ఆసీస్ ఆటగాళ్లలో చూడవచ్చు. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ విషయంపై స్పందించాడు. ప్రత్యర్థులపై మాటల దాడి చేయడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలా మెరుగుపడ్డారని, ఐపీఎల్ కారణంగానే ఇది సాధ్యమైందని స్పష్టం చేశాడు. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
"ఐపీఎల్ చాలా విషయాల్లో మార్పును తీసుకొచ్చింది. క్రికెట్‌లో ఇప్పటికీ పోటీతత్వం ఉంది. కానీ మాటల దాడి, ఇతరులను కించపరిచేలా మాట్లాడటం లాంటి విషయాల్లో మార్పు వచ్చింది. స్లెడ్జింగ్‌ను ఇప్పుడు అసహ్యించుకోవాల్సిన అవసరం లేదు. ఇరు పక్షాలు పరస్ఫరం గౌరవించుకోవడం, అభినందించురునే ఆటగా క్రికెట్ మారింది. ఇదే సమయంలో పోటీతత్వం, పరుగుల దాహం అలాగే ఉంది." అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
ఆటలో ఇరు పక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చాలా వరకు తగ్గాయని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. "మ్యాచ్‌లో ప్రత్యర్థుల మధ్య తీవ్రమైన అంశాలు, ఉద్రిక్తతను సృష్టించే పరిస్థితులు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది నేను ప్రత్యక్షంగా చూశాను. ఇదే సమయంలో పోటీతత్వం మాత్రం అలాగే ఉంది. ఇలాగే ముందుకు సాగడం మంచిదని నేను భావిస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఆట పురోగతి సాధిస్తుంది. ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో ఉద్రిక్తతలు పెరుగుతుంటే ప్రేక్షకులు ఎలాగైనా చూస్తారు. కాబట్టి ఆటగాళ్ల మధ్య స్నేహం ఉండటం బాగుంది. పోటీ కూడా సరదాగా ఉంది." అని కోహ్లీ తెలిపాడు.
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రత్యర్థుల మధ్య పోటీ అనేది మైదానానికే పరిమితమైందని కోహ్లీ అనడం విశేషం. ప్రస్తుతం టీమిండియా.. ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక మూడో వన్డేలో తలపడనుంది. బుధవారం నాడు చెన్నై వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.