Ab de Villiers on IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్‌ను, క్రికెటర్ల జీవితాలను ఎంతగానో మార్చేసింది. ఈ లీగ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో లీగ్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) కూడా ప్రారంభం కాబోతోంది. వచ్చే నెలలోనే తొలి లీగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఆ లీగ్‌పై స్పందించాడు.,ఐపీఎల్ తమ జీవితాలను మార్చేసిందని, ఇప్పుడు సౌతాఫ్రికా లీగ్ కూడా ఆ దేశ యువ క్రికెటర్ల జీవితాలను మార్చేస్తుందన్న ఆశభావం డివిలియర్స్ వ్యక్తం చేశాడు. ఆరు జట్లతో తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ జనవరి 10న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఎంఐ కేప్‌టౌన్, పార్ల్ రాయల్స్ తలపడనున్నాయి. ఇక ఈ లీగ్‌లోని మొత్తం ఆరు టీమ్స్‌నూ ఐపీఎల్ ఫ్రాంఛైజీలే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.,2008లో తొలి ఐపీఎల్ సీజన్ నుంచి 2021 వరకూ అన్ని సీజన్లలోనూ డివిలియర్స్ ఆడాడు. ఇప్పుడు SA20 కూడా సౌతాఫ్రికాలో క్రికెట్‌కు అవసరమైన బూస్ట్‌ను అందిస్తుందన్న ఆశతో ఏబీ ఉన్నాడు. "SA20 సరైన సమయంలో వస్తుందని నేను అనుకుంటున్నాను. కొన్ని దేశాల్లో ఈ లీగ్స్ చేసిన అద్భుతాలను మనం చూశాం" అని క్రికెట్ సౌతాఫ్రికాతో డివిలియర్స్ అన్నాడు.,"ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్స్‌తో ఆడే అవకాశాన్ని యువ ప్లేయర్స్‌కు ఈ లీగ్ వల్ల సాధ్యమవుతుంది" అని ఏబీ చెప్పాడు. ఇక ఈ లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ తరఫున ఆడుతున్న డివాల్డ్ బ్రెవిస్‌లాంటి యువ ప్లేయర్స్ ఆటపై డివిలియర్స్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నాడు. ఈ ఏడాది అండర్ 19 వరల్డ్‌కప్‌లో రికార్డులు బ్రేక్ చేసి వెలుగులోకి వచ్చిన బ్రెవిస్.. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ ఒకటి, రెండు మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించాడు.,క్రికెట్ సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్ టోర్నీలోనూ బ్రెవిస్ కేవలం 57 బాల్స్‌లోనే 162 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ ప్లేర్స్ సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్‌లతో కలిసి ఆడటం బ్రెవిస్ వృద్ధికి కారణమైందని ఏబీ అభిప్రాయపడ్డాడు. "సౌతాఫ్రికా టీ20 లీగ్ నాతోపాటు మరెంతో మంది ప్లేయర్స్‌కు గొప్ప అవకాశం. ఐపీఎల్ మా జీవితాలను మార్చేసింది. సౌతాఫ్రికా ఫ్యాన్స్‌కు క్రికెట్‌పై చాలా ఆసక్తి ఉంది. వాళ్లు సొంత టీమ్ ప్లేయర్స్‌నే కాదు విదేశీ ప్లేయర్స్‌ను కూడా ఆదరిస్తారు" అని ఏబీ అన్నాడు.,ఇక SA20 లీగ్ కమిషనర్‌గా ఉన్న సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌పైనా ప్రశంసలు కురిపించాడు. స్మిత్ లేకుండా అసలు ఈ లీగ్ సాధ్యమయ్యేదే కాదని ఏబీ స్పష్టం చేశాడు. అందుకు సౌతాఫ్రికా క్రికెట్ మొత్తం స్మిత్‌కు రుణపడి ఉంటుందని చెప్పాడు.,