తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul: ధోనీ, రోహిత్‌ కెప్టెన్సీలతో నా కెప్టెన్సీ పోల్చుకోలేను: కేఎల్‌ రాహుల్‌

KL Rahul: ధోనీ, రోహిత్‌ కెప్టెన్సీలతో నా కెప్టెన్సీ పోల్చుకోలేను: కేఎల్‌ రాహుల్‌

Hari Prasad S HT Telugu

17 August 2022, 20:01 IST

google News
    • KL Rahul: టీమిండియా కెప్టెన్‌గా మరో పరీక్షకు సిద్ధమవుతున్నాడు కేఎల్‌ రాహుల్‌. గాయం నుంచి కోలుకొని వచ్చిన తర్వాత జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
వన్డే సిరీస్ ట్రోఫీతో జింబాబ్వే, ఇండియా కెప్టెన్లు రెగిస్ చకాబ్వా, కేఎల్ రాహుల్
వన్డే సిరీస్ ట్రోఫీతో జింబాబ్వే, ఇండియా కెప్టెన్లు రెగిస్ చకాబ్వా, కేఎల్ రాహుల్ (AP)

వన్డే సిరీస్ ట్రోఫీతో జింబాబ్వే, ఇండియా కెప్టెన్లు రెగిస్ చకాబ్వా, కేఎల్ రాహుల్

హరారె: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ గురువారం (ఆగస్ట్‌ 18) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా బుధవారం కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మీడియాతో మాట్లాడాడు. ఇందులో అనేక అంశాలపై అతడు తన అభిప్రాయాలు చెప్పాడు. మామూలుగా చాలా కూల్‌గా, కామ్‌గా ఉండే రాహుల్.. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్స్‌కు అలాగే కెప్టెన్సీ చేస్తున్నాడు.

దీంతో రాహుల్ కెప్టెన్సీని చాలా మంది ధోనీ, రోహిత్‌ శర్మలతో పోలుస్తున్నారు. ఈ ఇద్దరు కూడా చాలా కామ్‌గా తమ పని తాము చేసుకుంటూ వెళ్తారన్న పేరుంది. అయితే రాహుల్‌ మాత్రం తన కెప్టెన్సీని వాళ్ల కెప్టెన్సీలతో పోల్చుకోలేనని అంటున్నాడు. టీమ్‌ను సమర్థంగా ముందుండి నడిపించడంలో తానింకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని రాహుల్‌ చెప్పాడు.

ఇండియాకు ఇప్పటి వరకూ రాహుల్‌ నాలుగు సందర్భాల్లో కెప్టెన్‌గా ఉన్నాడు కేఎల్‌ రాహుల్‌. సౌతాఫ్రికాతో ఒక టెస్ట్‌, మూడు వన్డేల సిరీస్‌లో కెప్టెన్సీ అవకాశం రాగా.. అన్ని మ్యాచ్‌లలోనూ ఇండియా ఓడిపోయింది. ఐపీఎల్‌లోనూ పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌గా అతడు విఫలమయ్యాడు. ఈసారి లక్నో కెప్టెన్‌గా మాత్రం ఫర్వాలేదనిపించాడు. అయితే కామ్‌గా తన స్వభావం ధోనీ, రోహిత్‌లకు ఎలా భిన్నమైదని అని అడిగినప్పుడు రాహుల్‌ ఇలా స్పందించాడు.

"నాకు తెలియదు. నేనైతే వ్యక్తిగతంగా అలా పోల్చుకోను. అలాంటి వ్యక్తులతో కెప్టెన్‌గా నన్ను నేను అస్సలు పోల్చుకోలేను. వాళ్లు సాధించిన ఘనతలు చాలా గొప్పవి. అలాంటి వాళ్లతో ఎవరినీ పోల్చలేం. నా వరకూ నేనిప్పటికీ యువకుడినే. కెప్టెన్‌గా నాకు ఇది రెండో సిరీస్‌. వాళ్ల కెప్టెన్సీలో ఆడాను. నేర్చుకున్నాను. వాళ్ల నుంచి కొన్ని లక్షణాలను పొందాను. కెప్టెన్‌గా మనం నిజాయతీగా ఉంటే ప్లేయర్స్‌ కూడా అలాగే ఉంటారు" అని రాహుల్‌ అన్నాడు.

"నేను కామ్‌గా ఉండే వ్యక్తిని. దానికి భిన్నంగా ఉండటానికి ప్రయత్నించలేను. అది నాకు, టీమ్‌కు, గేమ్‌కు కూడా మంచిది కాదు. నేను నాలాగే ఉండటానికి ప్రయత్నిస్తాను. ఇతర ప్లేయర్స్‌ను వాళ్లలాగే ఉంచడానికి ప్రయత్నిస్తే మంచిది" అని రాహుల్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ తర్వాత గాయం కారణంగా రాహుల్‌ ఒక్క సిరీస్‌ కూడా ఆడలేకపోయాడు.

మొదట గజ్జల్లో గాయం కారణంగా సర్జరీ చేయించుకున్న అతడు.. తర్వాత కరోనా బారిన పడ్డాడు. ఆసియాకప్‌ రానున్న నేపథ్యంలో తనను తాను ప్రూవ్‌ చేసుకోవాల్సి అవసరం రాహుల్‌కు ఉంది.

తదుపరి వ్యాసం