Ind vs Zim: ఇండియాపై మా ప్లాన్స్ మాకున్నాయి: జింబాబ్వే ఆల్‌రౌండర్
17 August 2022, 18:44 IST
- Ind vs Zim: జింబాబ్వేతో ఇండియా మూడు వన్డేల సిరీస్ గురువారం (ఆగస్ట్ 18) నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు జింబాబ్వే ఆల్‌రౌండర్ రియాన్ బర్ల్ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఇండియాకు ఓ వార్నింగ్ ఇస్తున్నాడు.
జింబాబ్వే ఆల్ రౌండర్ రియాన్ బర్ల్
హరారె: జింబాబ్వే క్రికెట్‌లో అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ పసికూనగానే ఉంది. కొన్నేళ్ల కిందటి వరకూ అప్పుడప్పుడూ పెద్ద టీమ్స్‌కు షాక్ ఇస్తూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఆ టీమ్ ఆటతీరు దారుణంగా మారింది. అయితే ఈ మధ్య బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు రెండింటినీ ఆ టీమ్ గెలుచుకొని సంచలనం సృష్టించింది.
ఈ సిరీస్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్ రియాన్ బర్ల్ పేరు బాగా వినిపించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇతడు ఒకే ఓవర్లో 34 రన్స్ బాది రికార్డు బుక్కుల్లోకి కూడా ఎక్కాడు. బంగ్లా బౌలర్ నాసమ్ అహ్మద్ బౌలింగ్‌లో ఐదు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు బర్ల్. అలాంటి ప్లేయర్ ఇండియాతో సిరీస్‌కు ముందు రాహుల్ సేనకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇండియన్ టీమ్‌తో వన్డే సిరీస్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.
హోమ్ కండిషన్స్‌లో ఆడుతుండటం తమకు కలిసొచ్చే విషయమని బర్ల్ అంటున్నాడు. "బ్యాటర్లకు మా బెస్ట్ బాల్స్‌ను వేస్తాం. సాధ్యమైనంత వరకూ సింపుల్‌గా ఉంచేలా చూస్తాం. మేమెలాగూ సొంతగడ్డపై ఆడుతున్నాం. ఇక్కడి కండిషన్స్ మాకు బాగా తెలుసు. మా గేమ్ ప్లాన్స్ మాకున్నాయి. మ్యాచ్ రోజు ఫీల్డ్‌లోకి వెళ్లి మా అత్యుత్తమ ఆట ఆడితే చాలు" అని బర్ల్ హిందుస్థాన్ టైమ్స్‌తో అన్నాడు.
రియాన్ బర్ల్ ఓ లెఫ్టాండ్ బ్యాటర్. అతనికి దూకుడు కాస్త ఎక్కువే. బంగ్లాదేశ్‌పై ఇప్పుడే కాదు.. 2019లోనూ వాళ్ల సొంతగడ్డపై కూడా బర్ల్ చెలరేగిపోయాడు. అప్పుడు కూడా షకీబుల్ హసన్ వేసిన ఒకే ఓవర్లో 30 రన్స్ బాదాడు బర్ల్. అందులో మూడు సిక్స్‌లు, మూడు ఫోర్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌పై సిరీస్ గెలిచి ఊపు మీదున్న జింబాబ్వే.. ఇప్పుడు ఇండియాలాంటి క్రికెట్ జెయింట్‌కు షాకివ్వాలని తహతహలాడుతోంది. మరి కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని ఇండియన్ టీమ్ ఈ సవాలును ఎలా స్వీకరిస్తుందో చూడాలి.