Ind vs Zim: ఆసియా కప్‌కు ముందు రాహుల్‌కు జింబాబ్వే సిరీస్‌ బాగా పనికొస్తుంది: శిఖర్‌ ధావన్‌-kl rahul will gain lot with zimbabwe tour says shikhar dhawan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Zim: ఆసియా కప్‌కు ముందు రాహుల్‌కు జింబాబ్వే సిరీస్‌ బాగా పనికొస్తుంది: శిఖర్‌ ధావన్‌

Ind vs Zim: ఆసియా కప్‌కు ముందు రాహుల్‌కు జింబాబ్వే సిరీస్‌ బాగా పనికొస్తుంది: శిఖర్‌ ధావన్‌

Hari Prasad S HT Telugu
Aug 16, 2022 09:25 PM IST

Ind vs Zim: కీలకమైన ఆసియాకప్‌కు ముందు జరుగుతున్న జింబాబ్వే సిరీస్‌ స్టాండిన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు బాగా పనికొస్తుందని అన్నాడు ఓపెనర్‌ ధావన్‌. జింబాబ్వే సిరీస్‌ ప్రారంభానికి ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

మీడియాతో మాట్లాడుతున్న శిఖర్ ధావన్
మీడియాతో మాట్లాడుతున్న శిఖర్ ధావన్ (AP)

హరారె: ఇండియా మరో షార్ట్‌ సిరీస్‌ కోసం సిద్ధమవుతోంది. జింబాబ్వేతో గురువారం (ఆగస్ట్‌ 18) నుంచి ప్రారంభం కాబోయే మూడు వన్డేల సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని టీమ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. రాహుల్‌తోపాటు టీమ్‌లోని కొందరు ప్లేయర్స్‌కు ఆసియాకప్‌ కంటే ముందు ఈ సిరీస్‌ రిథమ్‌లోకి రావడానికి బాగా ఉపయోగపడనుంది. ఇదే విషయాన్ని ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా చెబుతున్నాడు.

నిజానికి రాహుల్‌ టీమ్‌లోకి రాక ముందు జింబాబ్వే సిరీస్‌కు ధావనే కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ తిరిగి రావడంతో ఈ సిరీస్‌కు కెప్టెన్‌ను చేశారు. ఐపీఎల్‌ తర్వాత ఇప్పటి వరకూ మరో సిరీస్‌ ఆడని రాహుల్‌ జింబాబ్వేలో ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇండియన్‌ టీమ్‌కు ముఖ్యమైన ప్లేయర్స్‌లో రాహుల్‌ ఒకడని ఈ సందర్భంగా ధావన్‌ అన్నాడు.

"కేఎల్‌ తిరిగి టీమ్‌లోకి రావడంతోపాటు టీమ్‌ను లీడ్‌ చేయడం గుడ్‌ న్యూసే. ఇండియన్‌ మెయిన్‌ ప్లేయర్స్‌లో అతడూ ఒకడు. ఆసియా కప్‌ కంటే ముందు ఇది అతనికి మంచి అవకాశం కానుంది. ఈ టూర్‌ నుంచి రాహుల్ బాగానే లబ్ధి పొందుతాడు" అని ధావన్‌ అన్నాడు. ఇక టీమ్‌లో సీనియర్‌ సభ్యుడిగా ఏ యువ ప్లేయర్‌కైనా సలహాలు, సూచనలు ఇవ్వడానికి తాను సిద్ధమని కూడా ఈ సందర్భంగా ధావన్‌ చెప్పాడు.

2014లో తాను తొలిసారి జింబాబ్వే టూర్‌కు వచ్చానని, ఎవరైనా యువకులు సలహాల కోసం తన దగ్గరకి రావచ్చని అతనన్నాడు. ఇక వాషింగ్టన్‌ సుందర్‌ గాయం కారణంగా టూర్‌కు దూరం కావడంపై కూడా ధావన్‌ స్పందించాడు. అతడు లేకపోవడం బాధ కలిగించేదే అయినా, గేమ్‌లో గాయాలు సహజమేనని అన్నాడు. సుందర్‌ స్థానంలో లెఫ్టామ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌కు టీమ్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే.

WhatsApp channel