Gavaskar on Gill and Ishan: ఇండియన్ టీమ్ లేకపోయినా ఐపీఎల్ ఉందిగా.. అందుకే వాళ్లకు భయం లేదు: గవాస్కర్
24 January 2023, 9:53 IST
- Gavaskar on Gill and Ishan: ఇండియన్ టీమ్ లేకపోయినా ఐపీఎల్ ఉంది కదా, అందుకే యువ ఆటగాళ్లకు అసలు భయం లేదని అన్నాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. గిల్, ఇషాన్ చేసిన డబుల్ సెంచరీలను ఉద్దేశించి సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇషాన్ కిషన్, గవాస్కర్, శుభ్‌మన్ గిల్
Gavaskar on Gill and Ishan: ఇండియన్ క్రికెట్ టీమ్ లో ప్రస్తుతం యువ ఆటగాళ్లదే హవా. గత నెల రోజుల్లో వన్డేల్లో ఇద్దరు ప్లేయర్స్ డబుల్ సెంచరీలు చేశారు. ఎలాంటి భయం లేకుండా క్రీజులోకి రావడం, తమకు తెలిసిన పని చేసుకొని వెళ్లడం ఈ యంగ్ స్టర్స్ కు అలవాటుగా మారింది. గతేడాది బంగ్లాదేశ్ పై ఇషాన్ డబుల్ సెంచరీ బాదగా.. ఇప్పుడు న్యూజిలాండ్ పై శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేశాడు.
అయితే ఈ ఇద్దరినీ ఉద్దేశించి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ డబుల్ సెంచరీల తర్వాత కూడా వీళ్ల కాళ్లు నేలపైనే ఉంటాయా లేక అలసత్వంతో కనుమరుగవుతారా అన్నది చూడాలని అతడు అన్నాడు. గతంలో ఇండియన్ క్రికెట్ కరుణ్ నాయర్, రాజేష్ చౌహాన్, బాలాజీ, శివసుందర్ దాస్ లాంటి అనేక మంది ప్లేయర్స్ ను చూసింది. వీళ్లు మొదట్లోనే మురిపించి తర్వాత కనుమరుగయ్యారు.
"గత నెల రోజుల్లో ఇద్దరు వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు. రెండూ గొప్ప ఇన్నింగ్స్ లే. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ ఇద్దరు ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ ఎంతగానో పెరిగింది. వాళ్లు ఇంకా 20ల్లోనే ఉన్నారు.
వాళ్ల భవిష్యత్తు వాళ్ల చేతుల్లోనే ఉంది. ఈ ఇన్నింగ్స్ తర్వాత కూడా వాళ్ల కాళ్లు నేలపైనే ఉంటాయా లేక తాము క్రీజులోకి దిగితే చాలా రన్స్ వాటంతట అవే వస్తాయన్న అలసత్వం ప్రదర్శిస్తారా అన్నది చూడాలి" అని మిడ్ డేకు రాసిన కాలమ్ లో గవాస్కర్ అన్నాడు.
అయితే ఈ మధ్యకాలంలో ఇండియన్ టీమ్ లోకి వస్తున్న యువ ఆటగాళ్లలో అసలు భయం కనిపించడం లేదని, నేషనల్ టీమ్ లో చోటు కోల్పోతామన్న ఆందోళన వారికి లేదని సన్నీ అన్నాడు. దీనికి కారణం ఐపీఎల్ అని కూడా అతడు అభిప్రాయపడ్డాడు.
"ఈనాటి యువ ఆటగాళ్లు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇది మంచి విషయం. నేషనల్ టీమ్ లో నుంచి డ్రాప్ చేస్తారన్న ఆందోళన వాళ్లలో కనిపించదు. ఎందుకంటే ఐపీఎల్ కాంట్రాక్ట్ ఎలాగూ ఉందన్న ధీమా. అందుకే వైఫల్యాలు వారిని భయపెట్టవు. అందుకే క్రీజులోకి వెళ్లి భయంలేని క్రికెట్ ఆడతారు.
నేషనల్ టీమ్ లో స్థానం కోల్పోతామన్న ఆందోళన లేకపోతే వాళ్లు బిందాస్ క్రికెట్ ఆడగలుగుతారు. ఐపీఎల్లో కనీసం 14 మ్యాచ్ లు ఆడే అవకాశం దక్కుతుండటం వాళ్లను అంతర్జాతీయ క్రికెట్ లోని వైఫల్యాలను మరచిపోయేలా చేస్తుంది" అని గవాస్కర్ అన్నాడు.