తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar On Bharat: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భరత్ వద్దు.. రాహుల్‌ను తీసుకోండి: గవాస్కర్

Gavaskar on Bharat: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భరత్ వద్దు.. రాహుల్‌ను తీసుకోండి: గవాస్కర్

Hari Prasad S HT Telugu

14 March 2023, 15:36 IST

google News
    • Gavaskar on Bharat: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భరత్ వద్దు.. రాహుల్‌ను తీసుకోండి అని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చెప్పడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో భరత్ బ్యాట్‌తో నిరాశపరిచిన విషయం తెలిసిందే.
కెప్టెన్ రోహిత్ శర్మకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందిస్తున్న గవాస్కర్
కెప్టెన్ రోహిత్ శర్మకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందిస్తున్న గవాస్కర్ (ANI)

కెప్టెన్ రోహిత్ శర్మకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందిస్తున్న గవాస్కర్

Gavaskar on Bharat: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో ఇండియా గెలవకపోయినా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. శ్రీలంకను తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓడించడంతో ఇండియా చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఫైనల్ కు వెళ్లింది. ఇప్పుడు ఫైనల్లోనూ ఆస్ట్రేలియాతోనే టైటిల్ కోసం తలపడనుంది.

అయితే ఈ మ్యాచ్ కోసం మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలకమైన సూచన చేశాడు. బోర్డర గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన వికెట్ కీపర్ కేఎల్ భరత్ ను పక్కన పెట్టాలని, అతని స్థానంలో కేఎల్ రాహుల్ కే కీపింగ్ బాధ్యతలు అప్పగించాలని సూచించడం విశేషం. నిజానికి రాహుల్ కూడా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక తుది జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే.

అయితే రాహుల్ కు ఇంగ్లండ్ లో మంచి రికార్డు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా సన్నీ గుర్తు చేశాడు. "కేఎల్ రాహుల్ ను వికెట్ కీపర్ గా తీసుకోవచ్చు. డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగిన ఓవల్ లో అతడు ఐదు లేదా ఆరోస్థానంలో బ్యాటింగ్ చేస్తే బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుంది. గతేడాది రాహుల్ ఇంగ్లండ్ లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. లార్డ్స్ లో సెంచరీ కూడా చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టును ఎంపిక చేసే సమయంలో రాహుల్ ను గుర్తు పెట్టుకోండి" అని స్పోర్ట్స్ తక్ తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులు ముగిసిన తర్వాత రాహుల్ తన వైస్ కెప్టెన్సీతోపాటు తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. రిషబ్ పంత్ ప్రమాదంలో గాయపడినప్పటి నుంచీ టెస్టుట్లో వికెట్ కీపింగ్ స్థానం భర్తీ చేయడం సవాలుగా మారింది. భరత్ ను తీసుకున్నా.. అతడు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. అందుకే ఇంగ్లండ్ లో గతంలో రాణించిన రాహుల్ ను తీసుకోవాలని గవాస్కర్ సూచిస్తున్నాడు.

"కామెంట్రీ సందర్భంగా దినేష్ కార్తీక్ వికెట్ కీపింగ్ సమస్యల గురించి బాగా చెప్పాడు. వికెట్ కీపర్లకు బంతి టర్న్ అయ్యే పిచ్ లపైనే అసలైన పరీక్ష ఎదురవుతుంది. ట్రావిస్ హెడ్ ఔటైన విధానం చూస్తే బంతి టర్న్ అయి స్టంప్స్ ను తగిలినప్పుడు భరత్ గ్లోవ్స్ అసలు బంతికి దగ్గరగా లేనే లేవు. అంటే ఒకవేళ బంతి స్టంప్స్ ను తగలకపోయి ఉంటే నాలుగు బైస్ వచ్చేవి.

ఇది కచ్చితంగా ఆందోళన కలిగించేదే. భరత్ ను తుదిజట్టులోకి ఎంపిక చేస్తారా లేదా అన్నది సెలక్షన్ కమిటీ నిర్ణయం. కానీ స్టంప్స్ కు దగ్గరగా నిల్చోవాల్సిన అవసరం రాని ఇంగ్లండ్ పరిస్థితులలో రాహుల్ ను వికెట్ కీపర్ గా పరిశీలించవచ్చు. ఇషాన్ కిషన్ అయినా సరే. వాళ్ల బ్యాటింగ్ భరత్ కంటే మెరుగ్గా ఉంటుంది" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.

తదుపరి వ్యాసం