తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma On Wtc: కొంతమందిని ఐపీఎల్‌ మధ్యలోనే యూకే పంపిస్తాం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit Sharma on WTC: కొంతమందిని ఐపీఎల్‌ మధ్యలోనే యూకే పంపిస్తాం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

14 March 2023, 9:24 IST

google News
    • Rohit Sharma on WTC: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు టీమిండియా అర్హత సాధించడంతో ఆటగాళ్ల వర్క్ లోడ్‌పై రోహిత్ శర్మ స్పందించాడు. పని భారం అధిగమించడానికి డబ్ల్యూటీసీ ఆడే కొంతమందిని ఐపీఎల్ గ్రూప్ మ్యాచ్‌లు అయిపోగానే సన్నాహకం కోసం యూకే పంపిస్తామని స్పష్టం చేశాడు.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (PTI)

రోహిత్ శర్మ

Rohit Sharma on WTC: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా నాలుగో సారి టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అంతేకాకుండా న్యూజిలాండ్‌పై శ్రీలంక ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తును కూడా ఖారారు చేసుకుంది. దీంతో ఫైనల్లో ఆసీస్‌తో తలపడనుంది. అయితే వెంటనే ఐపీఎల్, ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో ఆటగాళ్లపై వర్క్ లోడ్ పడనుంది. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. ప్లేయర్లపై భారం పడకుండా ఉండేందుకు జట్టు మేనేజ్మెంట్ ఐపీఎల్ 2023 జరుగుతున్నప్పుడే డబ్ల్యూటీసీ సన్నాహాల్లో భాగంగా కొంతమందిని ముందే యూకేకు పంపిస్తామని తెలిపాడు.

"ఇది మాకు కాస్త ఇబ్బందైన విషయమే. మేము డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోయే ఆటగాళ్లందరితోనూ నిరంతరం టచ్‌లో ఉంటాము. వారి వర్క్ లోడ్‌ను పర్యవేక్షించి వారికి ఎలా ఉందో చూస్తాం. మే 21 నాటికి లీగ్ మ్యాచ్‌లు ముగుస్తాయి. ఐపీఎల్ ప్లే ఆఫ్ నుంచి ఆరు జట్లు తప్పుకుంటాయి. కాబట్టి ఎవరెవరు అందుబాటులో ఉంటారో వారిని వీలైనంత వరకు యూకేకు పంపిస్తాము. వీలైనంత వరకు కొంత సమయం వారిని పర్యవేక్షిస్తాం." అని రోహిత్ శర్మ అన్నాడు.

డబ్ల్యూటీసీలో జట్టు ఎంపిక తను పెద్ద సమస్యని అనుకోవట్లేదని హిట్ మ్యాన్ తెలిపాడు. "ఐపీఎల్ ఫైనల్‌లో ఆడే ఆటగాళ్లు డబ్ల్యూటీసీలో ఉండేవాళ్లు కాదనే అనుకుంటున్నా. ఒకవేళ ఉన్నా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే. మిగిలినవారంతా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడతారు. ఇది పెద్ద సమస్య అని నేను అనుకోవట్లేదు." అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

సోమవారం నాడు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఓడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లంకేయులు ఓడిపోవడంతో భారత్‌కు మార్గం సుగమమైంది. దీంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. జూన్ 9న యూకే ఓవల్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

తదుపరి వ్యాసం