Srikanth on KL Rahul: రాహుల్ ఆడనందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలపాలి.. ఆడుంటే ఇంకోలా ఉండేది.. శ్రీకాంత్ షాకింగ్ కామెంట్లు
Srikanth on KL Rahul: టీమిండియా మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్.. కేఎల్ రాహుల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఇండోర్ పిచ్‌పై ఆడి విఫలమైనట్లయితే అతడి కెరీర్ ముగిసి ఉండేదని స్పష్టం చేశారు.
Srikanth on KL Rahul: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓడిపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్ పేలవంగా ఉండటంతో చాలా మంది రకరకాల విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి రెండు టెస్టుల్లోనూ స్పిన్‌కు అనుకూలించినప్పటికీ మూడో పిచ్ మాత్రం మరి పేలవంగా ఉండటంతో దీనికి డీమెరిట్ పాయింట్లు సైతం ఇచ్చారు. ఇంక ఆటగాళ్ల విషయానికొస్తే భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడని కేఎల్ రాహుల్‌ను మూడో టెస్టుకు దూరం పెట్టి.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను తీసుకున్నారు. అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించలేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆడి విఫలమై ఉండుంటే అతడిపై మరిన్ని విమర్శలు వచ్చేవని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పష్టం చేశారు. అతడు ఆడకపోవడమే మంచిదైందని అన్నారు.
“ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో కేఎల్ రాహుల్ ఆడకపోవడం మంచిదైంది. ఒకవేళ అతడు ఆడి ఇలాంటి పిచ్‌పై విఫలమై ఉన్నట్లయితే అతడి టెస్టు కెరీర్‌కు ముగింపు పడే ప్రమాదం ఉండేది. అందుకే మూడో టెస్టులో రాహుల్ లేనందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇండోర్ పిచ్‌పై బ్యాటింగ్ చాలా కష్టం. అలాంటి వికెట్‌పై విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు.” అని శ్రీకాంత్ అన్నాడు.
"ఆసీస్ బౌలర్ కునేమన్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇలాంటి పిచ్‌పై వికెట్ తీయడం పెద్ద కష్టమేమి కాదు. నేను బౌలింగ్ చేసినా వికెట్లు వస్తాయి." అని శ్రీకాంత్ స్పష్టం చేశారు.
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడో రోజు ఉదయమే మ్యాచ్ ముగిసింది. మ్యాచ్‌లో పిచ్ స్పిన్‌కు విపరీతంగా అనుకూలించింది. తొలి రోజు ఆరంభం నుంచే పిచ్‌పై స్పిన్నర్లు విజృంభించారు. ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. మార్చి 9 నుంచి ఆఖరుదైన నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది.