FIFA World Cup Schedule Today: జర్మనీ గెలిచి నిలుస్తుందా? ఫిఫా వరల్డ్‌కప్‌లో అదిరిపోయే మ్యాచ్‌లు
01 December 2022, 10:04 IST
- FIFA World Cup Schedule Today: జర్మనీ గెలిచి నిలుస్తుందా? బెల్జియం, క్రొయేషియాలు ముందడుగు వేస్తాయా? ఇదీ గురువారం (డిసెంబర్ 1) ఫిఫా వరల్డ్‌కప్‌లో జరగబోయే మ్యాచ్‌లపై ఫ్యాన్స్‌లో ఉన్న ఆసక్తి.
జర్మనీ టీమ్ కచ్చితంగా గెలిస్తేనే ముందుకు వెళ్తుంది
FIFA World Cup Schedule Today: ఫిఫా వరల్డ్‌కప్‌లో గురువారం (డిసెంబర్ 1) అదిరిపోయే మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ ఇ, గ్రూప్ ఎఫ్‌లలో నాకౌట్ స్టేజ్‌కు ఎవరు చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. జర్మనీ, బెల్జియం, క్రొయేషియాలాంటి టీమ్స్‌కు ఈ మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. గ్రూప్ ఇలో ఉన్న మాజీ ఛాంపియన్ జర్మనీ తన చివరి మ్యాచ్‌లో కోస్టారికాతో తలపడనుంది.
ఈ గ్రూప్‌లో స్పెయిన్‌తో జపాన్, కోస్టారికాతో జర్మనీ తలపడనున్నాయి. స్పెయిన్ నాలుగు పాయింట్లతో టాప్‌లో ఉండగా.. జపాన్ మూడు పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. కోస్టారికా కూడా మూడు పాయింట్లతో మూడోస్థానంలో, జర్మనీ ఒక పాయింట్‌తో చివరి స్థానంలో ఉన్నాయి. అయితే అన్ని టీమ్స్‌కూ ఇప్పటికీ రౌండ్ ఆఫ్ 16 చేరే అవకాశం ఉండటం ఈ గ్రూప్ విశేషం.
జపాన్‌తో డ్రా చేసుకున్నా చాలు స్పెయిన్ నాకౌట్‌కు చేరుతుంది. ఒకవేళ స్పెయిన్ ఓడితే కోస్టారికా, జర్మనీ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అటు జపాన్ గెలిస్తే తర్వాతి రౌండ్ చేరుతుంది. డ్రా అయితే మరో మ్యాచ్ ఫలితం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ కోస్టారికా రౌండ్ ఆఫ్ 16 చేరాలంటే కచ్చితంగా గెలవాలి. ఒకవేళ డ్రా అయితే అటు జపాన్ ఓడిపోవాలి. జర్మనీ నాకౌట్ చేరాలంటే మాత్రం కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అదే సమయంలో జపాన్ కూడా ఓడిపోవాలి.
అటు గ్రూప్ ఎఫ్‌లో క్రొయేషియా, బెల్జియం తలపడనున్నాయి. మరోవైపు ఇదే గ్రూప్‌లో ఉన్న కెనడా, మొరక్కో మ్యాచ్ కూడా జరగనుంది. ఈ గ్రూప్‌లో క్రొయేషియా టాప్‌లో ఉండగా.. మొరక్కో రెండోస్థానంలో ఉంది. రెండు టీమ్స్ నాలుగేసి పాయింట్లతోనే ఉన్నాయి. బెల్జియం మూడు, కెనడా నాలుగోస్థానంలో ఉన్నాయి. అయితే రౌండ్ ఆఫ్ 16 చేరాలంటే క్రొయేషియా, బెల్జియం గెలిచి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో వీళ్ల మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే మొరక్కో, కెనడా ఫలితం కోసం చూడాలి. ఒకవేళ క్రొయేషియా ఓడిపోతే.. అటు కెనడా చేతుల్లో మొరక్కో ఓడిపోతేనే ఆ టీమ్‌కు ఛాన్స్ ఉంటుంది. మొరక్కో ఈ మ్యాచ్ గెలిస్తే నాకౌట్ చేరుతుంది. డ్రా అయితే క్రొయేషియా, బెల్జియం మ్యాచ్ వైపు చూడాలి.
ఫిఫా వరల్డ్‌కప్‌లో గురువారం (డిసెంబర్ 1) నాటి మ్యాచ్‌లు
క్రొయేషియా vs బెల్జియం రాత్రి 8.30
కెనడా vs మొరక్కో రాత్రి 8.30
జపాన్ vs స్పెయిన్ అర్ధరాత్రి 12.30
జర్మనీ vs కోస్టారికా అర్ధరాత్రి 12.30