Fifa World Cup Croatia vs Canada: కెనడాను చిత్తు చేసిన క్రొయేషియా - స్పెయిన్ జర్మనీ మ్యాచ్ డ్రా
Fifa World Cup Croatia vs Canada: ఫిఫా వరల్డ్ కప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కెనడాను 4-1 గోల్స్ తేడాతో క్రొయేషియా చిత్తు చేసింది. స్పెయిన్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Fifa World Cup Croatia vs Canada: ఫిఫా వరల్డ్ కప్‌లో ఆదివారం కెనడాను క్రొయేషియా 4-1 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో కెనడాపై క్రొయేషియా సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. క్రమరిక్ రెండో గోల్స్‌తో క్రొయేషియాకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో తొలి గోల్ మాత్రం కెనడా చేసింది. ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే ఆల్ఫాన్సో డేవిస్ గోల్ చేసి క్రొయేషియాకు షాక్ ఇచ్చాడు. స్కోరును సమం చేసేందుకు క్రొయేషియా ఆటగాళ్లు గట్టిగా ప్రయత్నించారు.
36వ నిమిషంలో క్రమరిక్ గోల్ చేసి క్రొయేషియాకు ఊరటనిచ్చాడు. 44వ నిమిషంలో వివజా గోల్‌తో క్రొయేషియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. 70వ నిమిషంలో మరో గోల్ చేసిన క్రమరిక్ విజయాన్ని ఖాయం చేశాడు.
ఆట చివరలో మజేర్ గోల్‌తో క్రొయేషియా 4-1 తేడాతో కెనడాపై విజయాన్ని సాధించింది. రెండు విజయాలతో గ్రూప్ ఎఫ్‌లో క్రొయేషియా టాప్ ప్లేస్‌లో నిలవగా వరుసగా రెండు ఓటములతో కెనడా వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది.
మ్యాచ్ డ్రా...
ఆదివారం అర్ధరాత్రి జర్మనీ, స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. మాజీ చాంఫియన్ జర్మనీకి స్పెయిన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గోల్ చేసేందుకు ఇరు జట్లు గట్టిగా ప్రయత్నించాయి. 62వ నిమిషంలో మొరాటో గోల్ చేసి స్పెయిన్ అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. జర్మనీ ఓటమి ఖాయమని అనుకుంటున్న తరుణంలో నిక్లాస్ ఫల్‌ఖర్గ్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరు జట్లు మరో గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది