Dale Steyn on Suryakumar: సూర్యకుమార్.. డివిలియర్స్‌కు ఇండియన్ వెర్షన్: స్టెయిన్
12 October 2022, 19:53 IST
- Dale Steyn on Suryakumar: సూర్యకుమార్ యాదవ్‌ను సౌతాఫ్రికా లెజెండరీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌తో పోల్చాడు ఆ టీమ్ మాజీ బౌలర్ డేల్ స్టెయిన్. అతన్ని చూస్తే డివిలియర్సే గుర్తొస్తున్నాడని అన్నాడు.
సూర్యకుమార్ యాదవ్
Dale Steyn on Suryakumar: ప్రస్తుతం వరల్డ్ క్రికెట్‌లో, ముఖ్యంగా టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడనడంలో సందేహం లేదు. అతని దూకుడు, ఎలాంటి బౌలర్ అయినా భయం లేకుండా ఆడే తీరు, గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడగలిగే సత్తా సూర్యను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. సూర్య ఆట చూసి అతన్ని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్‌తో పోలుస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
తాజాగా సౌతాఫ్రికాకే చెందిన మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ కూడా సూర్యను డివిలియర్స్‌తో పోల్చడం విశేషం. గతంలో డివిలియర్స్ కూడా ఇలాగే నాలుగోస్థానంలో వచ్చి దూకుడుగా ఆడుతూ గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరుగాంచాడు. దీంతో సూర్య కూడా ఇండియన్ వెర్షన్ ఆఫ్ డివిలియర్స్ అంటూ స్టెయిన్ అనడం విశేషం.
"బంతి పేస్‌ను ఉపయోగించుకునే ప్లేయర్ అతడు. స్క్వేర్‌లెగ్ వైపు ఎక్కువగా ఆడటానికి ఇష్టపడతాడు. పెర్త్, మెల్‌బోర్న్‌లాంటి గ్రౌండ్‌లలో బంతికి అదనపు పేస్ ఉంటుంది. ఆ పేస్‌ను ఉపయోగించి ఫైన్ లెగ్, వికెట్ల వెనుకాల, గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడొచ్చు. బ్యాక్‌ఫుట్‌లో ఆడటంలో సూర్య దిట్ట. అతడు బ్యాక్‌ఫుట్ డ్రైవ్స్, ఫ్రంట్‌ఫుట్ కవర్ డ్రైవ్స్ చాలానే ఆడాడు" అని స్టెయిన్ అన్నాడు.
"అందుకే అతడు ఆల్‌రౌండ్ ప్లేయర్. ఆస్ట్రేలియాలో వికెట్లు బాగుంటాయి. అవి బ్యాటర్లకు అనుకూలిస్తాయి. సూర్య అద్భుతమైన 360 డిగ్రీ ప్లేయర్. అతన్ని చూస్తే డివిలియర్స్ గుర్తొస్తాడు. అతడు డివిలియర్స్‌కు ఇండియా వెర్షన్ అని చెప్పొచ్చు. అతడున్న ఫామ్ చూస్తే ఈ వరల్డ్‌కప్‌లో కచ్చితంగా చూడదగిన ప్లేయర్ అని చెప్పొచ్చు" అని స్టెయిన్ స్పష్టం చేశాడు.
ఇండియా ఆడిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ సూర్య 52 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ టీ20 కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి మిడిలార్డర్‌లో వచ్చి 1045 రన్స్ చేశాడు. అది కూడా 176 స్ట్రైక్ రేట్‌తో కావడం విశేషం. నాలుగు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి ఈ స్ట్రైక్‌రేట్‌తో అన్ని రన్స్ చేసిన బ్యాటర్ మరొకరు లేరు.