Suryakumar About Dinesh Karthik: అతడి వల్ల నా స్థానానికి ముప్పు.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
Suryakumar About 4th Spot: సూర్యకుమార్ యాదవ్.. దినేశ్ కార్తిక్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి ఆటను చూస్తుంటే.. తన నాలుగో స్థానానికి ముప్పు వాటిల్లే అవకాశముందని జోక్ చేశాడు,
Suryakumar About Dinesh Karthik: రానున్న టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని పెట్టుకుంది. అయితే జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో బౌలింగ్ పరంగా బలహీనంగా కనిపిస్తోంది భారత్. మొన్నటి వరకు నాలుగో స్థానంలో నిలకడగా ఆడే బ్యాటర్ లేక సతమతమైన రోహిత్ సేన.. సూర్యకుమార్ యాదవ్ పుణ్యమాని ఆ స్థానంలో బలమైన బ్యాటర్ దొరికాడు. అంతేకాదు.. ఈ స్థానానికి తీవ్ర పోటీ కూడా నెలకొంది. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో దినేశ్ కార్తీక్ దిగి అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏకంగా సూర్యకుమారే అతడి ఆటతీరును ప్రశంసించాడంటే ఎలా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్.. తన నాలుగో స్థానానికి దినేశ్ కార్తిక్ రూపంలో ముప్పు ఉందని జోక్ చేశాడు.
ఈ క్యాలెండర్ ఇయర్‌లో 50 సిక్సర్లు కొట్టారు అని విలేకరు అడిగిన ప్రశ్నకు.. సూర్యకుమార్ నిజంగానా.. తాను గణాంకాలు చూసుకోలేదని బదులిచ్చాడు. "ఆటకు డిమాండ్ అలా ఉంది. నా స్నేహితులు వాట్సాప్‌లో ఈ విషయం గురించి పంపారు. అయితే నేను దాన్ని ఫాలో అవ్వను. ఎందుకు ఆటను ఆస్వాదించడంపైనే నా ఆలోచన ఉంది. ఈ మ్యాచ్‌లో ఓ స్థానం వెనక దిగి దినేశ్ కార్తీక్‌తో భాగస్వామ్యాన్ని నిర్మించాల్సి వచ్చింది. కానీ ఈ రోజు అది వర్కౌట్ కాలేదు. దినేశ్ కార్తిక్‌కు కొంత సమయం కావాలి. అతడు బ్యాటింగ్ చేసే విధానం చూస్తుంటే.. నా నాలుగో స్థానానికి ముప్పు కలిగిస్తాడని అనిపిస్తోంది. అయితే ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించదలచుకోలేదు." అని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌కు సీనియర్ ప్లేయర్లయిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతి ఇచ్చారు. వీరి స్థానంలో శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌కు అవకాశం కల్పించారు. ఈ మార్పులతో పాటు బ్యాటింగ్ లైనప్‌లోనూ జట్టు యాజమాన్యం కొన్ని మార్పులు చేసింది. రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్‌ను ఓపెనింగ్ పంపగా.. శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తిక్‍ను 3, 4 స్థానాల్లో పంపింది. ఈ మ్యాచ్‌లో దినేస్ కార్తిక్ 21 బంతుల్లో 46 పరుగులతో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అయితే మిగిలిన వారు విఫలం కావడంతో భారత్ పరాజయం పాలైంది.
సంబంధిత కథనం