Suryakumar Breaks Dhawan Record: శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన సూర్యకుమార్ యాదవ్
Suryakumar Breaks Dhawan Record: శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది టాప్ ఫామ్‌లో ఉన్న అతడు.. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ రికార్డు సాధించాడు.
Suryakumar Breaks Dhawan Record: ఇండియన్ టీమ్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ తన జోరు చూపిస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. రెండు టీమ్స్‌లోనూ ప్రతి బ్యాటర్ ఇబ్బంది పడిన పిచ్‌పై అలవోకగా బౌండరీలు బాదుతూ 33 బాల్స్‌లోనే 50 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.
అంతేకాదు ఈ ఇన్నింగ్స్‌తో ఇండియన్ టీమ్ ఓపెనర్ శిఖర్ ధావన్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. క్రీజులోకి వచ్చీ రాగానే వరుసగా రెండు సిక్సర్లు బాది తాను ఏం చేయబోతున్నాడో చెప్పకనే చెప్పాడు. ఆ రెండు సిక్స్‌లతోనే ధావన్ రికార్డు కూడా మరుగునపడి పోయింది. ఒక కేలండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటి వరకూ ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌కు ముందు అతని రికార్డుకు 8 రన్స్ దూరంలో ఉన్న సూర్య.. మొదట్లో రెండు సిక్స్‌లతోనే ఆ రికార్డు బ్రేక్ చేశాడు. 2022లో సూర్యకుమార్ 20 టీ20 మ్యాచ్‌లలో 720 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది ఈ ఫార్మాట్‌లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ కూడా అతడే.
మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరుగాంచిన సూర్య.. ప్రతి మ్యాచ్‌కూ మెరుగవుతున్నాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. ఇలా ప్రత్యర్థి ఎవరైనా చెలరేగిపోతున్నాడు. అసలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడటమే సూర్య అతి పెద్ద బలం. అదే ఇప్పుడతన్ని ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారుస్తోంది.
టీ20 వరల్డ్‌కప్‌కు ముందు అతని ఫామ్ ఇండియన్ టీమ్‌ను ఆనందానికి గురి చేసేదే. తరచూ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌తో సూర్యను పోలుస్తూ ఉంటారు. అందుకు తగినట్లే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఎలాంటి పరిస్థితుల్లో అయినా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. టీ20ల్లో రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లిన అతడు.. ఇప్పుడు టాప్ ప్లేస్‌పై కన్నేశాడు.