AB De Villiers Eye Surgery: ఐపీఎల్‌కు తిరిగొస్తున్నా.. కానీ ఒంటి కన్నుతో క్రికెట్ ఆడలేను: డివిలియర్స్
AB De Villiers Eye Surgery: ఐపీఎల్‌కు తిరిగొస్తున్నా.. కానీ ఒంటి కన్నుతో క్రికెట్ ఆడలేనని అన్నాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. ఈ మధ్య సోషల్ మీడియాలో అభిమానులతో అతడు మాట్లాడాడు.
AB De Villiers Eye Surgery: ఏబీ డివిలియర్స్.. సౌతాఫ్రికా క్రికెటరే అయినా.. ఐపీఎల్‌లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో ఇండియన్ ఫ్యాన్స్‌కే ఎక్కువ దగ్గరయ్యాడు. గతేడాది ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పిన అతడు.. వచ్చే ఏడాది ఈ మెగా లీగ్‌కు తిరిగొస్తున్నట్లు చెప్పాడు. అయితే క్రికెట్ మాత్రం ఆడలేనని, మరో రోల్‌లో వస్తున్నట్లు తెలిపాడు.
ఈ మధ్యే తన కంటికి సర్జరీ జరిగిందని, ఇక తాను క్రికెట్ ఆడలేనని స్పష్టం చేశాడు. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ సందర్భంగా తాను చిన్నస్వామి స్టేడియానికి తిరిగి రానున్నట్లు ఏబీ వెల్లడించాడు. "వచ్చే ఏడాది నేను చిన్నస్వామి స్టేడియానికి వెళ్తాను. కానీ క్రికెట్ ఆడటానికి కాదు. ఐపీఎల్ టైటిల్ ఇప్పటి వరకూ గెలవనందుకు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతాను. అంతేకాదు గత దశాబ్దకాలంగా వాళ్లు చూపించిన అభిమానానికి థ్యాంక్స్ చెబుతాను. నేను ఇక క్రికెట్ ఆడలేను. ఎందుకంటే నా కుడి కంటికి సర్జరీ జరిగింది" అని డివిలియర్స్ ఈ మధ్య ఓ సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో చెప్పాడు.
తానో యూట్యూబ్ ఛానెల్ తీసుకురానున్నట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించాడు. తన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటన్నది కూడా వివరించాడు. అయితే ఇప్పట్లో కోచింగ్ బాధ్యతలు మాత్రం చేపట్టబోనని కూడా చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయించాలని భావించిన ఏబీ.. కోచింగ్ బాధ్యతలు తీసుకుంటే అది కుదరదని అంటున్నాడు.
"టీమ్‌కు కోచ్‌గా ఉండే ఉద్దేశం మాత్రం నాకు లేదు. నేను నేర్చుకున్న అన్ని విషయాలను షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఓ టీమ్‌లో కోచ్‌గా చేరి ప్రపంచమంతా తిరగడం చేయలేను. 18 ఏళ్లపాటు తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు ఇంట్లో గడపడమే బాగుంది" అని డివిలియర్స్ అన్నాడు. ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడేందుకు తనకు ఆహ్వానం అందినా.. కంటికి సర్జరీ కారణంగా ఆడలేదని చెప్పాడు.