తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravichandran Ashwin: ద్రవిడ్, రోహిత్‍పై వచ్చిన విమర్శలపై గట్టి కౌంటర్లు ఇచ్చిన అశ్విన్

Ravichandran Ashwin: ద్రవిడ్, రోహిత్‍పై వచ్చిన విమర్శలపై గట్టి కౌంటర్లు ఇచ్చిన అశ్విన్

02 August 2023, 19:59 IST

google News
    • Ravichandran Ashwin: వెస్టిండీస్‍తో వన్డే సిరీస్ కోసం టీమిండియా తుది జట్టులో మార్పులు చేయగా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వచ్చాయి. వారిపై విమర్శలు చేసిన వారికి గట్టి కౌంటర్లు ఇచ్చాడు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
రవిచంద్రన్ అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్ (PTI)

రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin: వెస్టిండీస్‍తో రెండో వన్డే కోసం టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోగా.. యువ ప్లేయర్లు తుది జట్టులోకి వచ్చారు. అయితే, ఆ రెండో వన్డేను టీమిండియా ఓడిపోవటంతో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై చాలా మంది విమర్శలు చేశారు. నెజిజన్లతో పాటు కొందరు మాజీలు కూడా వారిపై వ్యాఖ్యలు చేశారు. అయితే, మూడో వన్డేలోనూ కోహ్లీ, రోహిత్ విశ్రాంతి తీసుకోగా.. భారత జట్టు భారీ తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ తరుణంలో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ద్రవిడ్, రోహిత్‍ను విమర్శించిన వారి పట్ల గట్టిగానే స్పందించాడు.

టీమిండియా ఒక్క మ్యాచ్ ఓడితేనే సోషల్ మీడియాలో ఎందుకు ఆగ్రహం వ్యక్తమవుతోందో తనకు అర్థం కావడం లేదని అశ్విన్ అన్నాడు. తన యూట్యూబ్ చానెల్‍లో ఈ విషయం గురించి మాట్లాడాడు. “ఇండియా రెండో వన్డే ఓడిపోయిన వెంటనే.. మ్యాచ్‍లో ఆ ప్లేయర్లు ఎందుకు ఆడారు.. వారెందుకు ఆడలేదు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆగ్రహం ఎందుకు వ్యక్తమవుతోందో నాకు అసలు అర్థం కావడం లేదు. రోహిత్, విరాట్ రెండో వన్డే ఆడలేదు. మొదటి మ్యాచ్‍లో రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్లో కింద ఆడాడు. (విరాట్ బ్యాటింగ్‍కు దిగలేదు). అలాంటప్పుడు రెండో వన్డేలో రోహిత్, కోహ్లీ ఆడాల్సిందన్న చర్చ అనవసరం” అని అశ్విన్ అన్నాడు.

భారత జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారని అశ్విన్ అన్నాడు. “ప్రపంచకప్‍నకు అర్హత సాధించని జట్టుపై (వెస్టిండీస్) కూడా ఎలా ఓడిపోయారని కొందరు అంటున్నారు. ప్రపంచకప్ గెలవడమే ఇంటర్నేషల్ క్రికెట్‍లో టీమిండియా కర్తవ్యమని కొందరు అనుకుంటున్నారు” అని అశ్విన్ చెప్పాడు.

శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ గాయాలతో బాధపడుతున్న తరుణంలో రోహిత్, కోహ్లీకి విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం ఇవ్వడం మంచి పనే అని అశ్విన్ అన్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉండడంతో ముందుగానే వేరే ప్లేయర్లను టీమిండియా ద్రవిడ్, రోహిత్ పరీక్షిస్తున్నారని అశ్విన్ అన్నాడు. సడన్‍గా అవసరమైనప్పుడు ఆటగాళ్లు రెడీగా ఉండేందుకు డిఫరెంట్ ఆప్షన్లను ట్రై చేస్తున్నారని అశ్విన్ సమర్థించాడు.

కాగా, టీమిండియా, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20 సిరీస్ రేపు (ఆగస్టు 3) మొదలుకానుంది.

తదుపరి వ్యాసం