తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Blue Card In Football: ఫుట్‌బాల్‌లో కొత్తగా బ్లూ కార్డ్.. అలాంటి ప్లేయర్స్ కోసమే..

Blue Card in Football: ఫుట్‌బాల్‌లో కొత్తగా బ్లూ కార్డ్.. అలాంటి ప్లేయర్స్ కోసమే..

Hari Prasad S HT Telugu

09 February 2024, 10:16 IST

google News
    • Blue Card in Football: ఫుట్‌బాల్ లో రిఫరీల చేతికి బ్లూకార్డ్ అనే మరో అస్త్రం రాబోతోంది. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డ్ ఈ కొత్త కార్డును తీసుకురానున్నట్లు స్కైన్యూస్ వెల్లడించింది.
ఫుట్‌బాల్‌లో కొత్తగా బ్లూ కార్డు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు
ఫుట్‌బాల్‌లో కొత్తగా బ్లూ కార్డు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు

ఫుట్‌బాల్‌లో కొత్తగా బ్లూ కార్డు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు

Blue Card in Football: ఫుట్‌బాల్ ఫీల్డ్ లో దురుసుగా ప్రవర్తించే ప్లేయర్స్ కు చెక్ పెట్టడానికి కొత్తగా బ్లూ కార్డును తీసుకువస్తున్నారు. ఈ బ్లూకార్డు సాయంతో ఓ ప్లేయర్ ను 10 నిమిషాల పాటు ఫీల్డ్ నుంచి బయటకు పంపే వీలు కలుగుతుంది. ఇప్పటికే ఫుట్‌బాల్ లో ఎల్లో, రెడ్, వైట్ కార్డులు ఉండగా.. ఇప్పుడు కొత్తగా బ్లూ కార్డును తీసుకొస్తున్నట్లు స్కై న్యూస్ తన రిపోర్టులో వెల్లడించింది.

ఫుట్‌బాల్‌లో బ్లూకార్డు.. అసలేంటిది?

కొన్ని దశాబ్దాలుగా ఫుట్‌బాల్ లో ఎల్లో, రెడ్ కార్డులను వాడుతున్న విషయం అభిమానులకు తెలుసు. ఫీల్డ్ లో ప్లేయర్స్ దురుసు ప్రవర్తనను నియంత్రించడానికి ఈ కార్డులను ప్రవేశపెట్టారు. అయితే ఫుట్‌బాల్ నిబంధనలను రూపొందించే ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (ఐఎఫ్ఏబీ) కొత్తగా బ్లూ కార్డు తీసుకురాబోతోందని స్కైన్యూస్ తెలిపింది.

ఫీల్డ్ ఓ ప్లేయర్ ఓ తీవ్ర తప్పిదానికి పాల్పడినా.. రిఫరీ మాటను ధిక్కరించినా సదరు ప్లేయర్ ను 10 నిమిషాల పాటు బయటకు పంపే అవకాశం ఈ బ్లూ కార్డు ద్వారా రిఫరీలకు దక్కుతుంది. అంతేకాదు ఒకే మ్యాచ్ లో రెండుసార్లు బ్లూ కార్డు చూపించినా, లేదంటే ఒక బ్లూ కార్డు, మరో ఎల్లో కార్డు చూపించినా ఆ ప్లేయర్ ను ఇక ఆ మ్యాచ్ లో బరిలోకి దిగనివ్వరు.

ఫుట్‌బాల్‌లో బ్లూకార్డు ఎప్పుడు?

ఈ బ్లూకార్డును మొదట స్థానిక మ్యాచ్ లలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. తర్వాత మెల్లగా అంతర్జాతీయ మ్యాచ్ లలోకి తీసుకురానున్నారు. ఎఫ్ఏ కప్, వుమెన్స్ ఎఫ్ఏ కప్ టోర్నీల్లోనే ఈ బ్లూకార్డు టెస్టింగ్ ప్రారంభం కావచ్చు.

అయితే ఇప్పటికే ఈ కార్డును వేల్స్ లో జరిగిన ఓ చిన్న ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఉపయోగించారు. ఎల్లో, రెడ్ కలర్స్ కు పూర్తి భిన్నమైన రంగు కావడంతో ఈ బ్లూ కార్డును ఎంపిక చేసినట్లు సదరు రిపోర్టు తెలిపింది.

అప్పుడు వైట్.. ఇప్పుడు బ్లూ..

ఫుట్‌బాల్ లో కార్డులంటే ఎల్లో, రెడ్ అనే అందరికీ తెలుసు. కానీ గతేడాది కొత్తగా వైట్ కార్డును ప్రవేశపెట్టారు. 1970 నుంచి ఫీల్డ్ లో ఉన్న ఎల్లో, రెడ్ కార్డులు కాకుండా ఈ వైట్ కార్డు చూపించడం ఇదే తొలిసారి. అయితే మిగతా కార్డుల్లాగా ఈ కార్డును ఓ ప్లేయర్ ను శిక్షించడానికి కాకుండా అభినందించడానికి వాడటం విశేషం. గతేడాది బెన్ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ వుమెన్స్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ కార్డు చూపించారు.

ఈ మ్యాచ్ సందర్భంగా డగౌట్ లో కూర్చున్న ఓ ప్లేయర్ హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ సమయంలో రెండు జట్ల మెడికల్ టీమ్స్ ఆ ప్లేయర్ కు చికిత్స అందించడానికి పరుగులు పెట్టాయి. ఈ చర్యను అభినందిస్తూ ఫీల్డ్ లోని రిఫరీ ఈ వైట్ కార్డు చూపించాడు. ఇక ఇప్పుడు బ్లూ కార్డు రూపంలో ఫుట్‌బాల్ ఫీల్డ్ లో మరో రంగు ఎంట్రీ ఇవ్వబోతోంది.

టాపిక్

తదుపరి వ్యాసం