First White Card in Football: ఫుట్‌బాల్‌ చరిత్రలో తొలిసారి వైట్ కార్డు చూపించిన రిఫరీ.. అసలు ఏంటిది?-first white card in football shown by the referee ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  First White Card In Football: ఫుట్‌బాల్‌ చరిత్రలో తొలిసారి వైట్ కార్డు చూపించిన రిఫరీ.. అసలు ఏంటిది?

First White Card in Football: ఫుట్‌బాల్‌ చరిత్రలో తొలిసారి వైట్ కార్డు చూపించిన రిఫరీ.. అసలు ఏంటిది?

Hari Prasad S HT Telugu
Jan 23, 2023 11:23 AM IST

First White Card in Football: ఫుట్‌బాల్‌ చరిత్రలో తొలిసారి వైట్ కార్డు చూపించాడు ఓ రిఫరీ. కొన్ని దశాబ్దాలుగా కేవలం ఎల్లో, రెడ్ కార్డులు మాత్రమే చూసిన అభిమానులకు ఇది వింతగా అనిపించి ఉండవచ్చు. ఇంతకీ ఈ వైట్ కార్డు ఏంటి?

వైట్ కార్డు చూపిస్తున్న రిఫరీ
వైట్ కార్డు చూపిస్తున్న రిఫరీ

First White Card in Football: ఫుట్‌బాల్‌ ను ఫాలో అయ్యే ప్రేక్షకులు ఎల్లో, రెడ్ కార్డులను తరచూ చూస్తూనే ఉంటారు. ఫీల్డ్ లో ప్లేయర్స్ దురుసుగా ప్రవర్తిస్తుంటే రిఫరీలు ఈ కార్డులను చూపిస్తుంటారు. దీని వల్ల అప్పటికప్పుడు ఫీల్డ్ నుంచి బయటకు పంపించేయడం, తర్వాత మ్యాచ్ ఆడకుండా నిషేధించడంలాంటి శిక్షలు ఉంటాయి.

అయితే ఫుట్‌బాల్‌ లో ఈ శిక్షలు విధించే కార్డే కాదు. మంచి చేస్తే మెచ్చుకునేందుకు మరో కార్డు కూడా ఉంది. అదే వైట్ కార్డు. ఇంతవరకూ ఫీల్డ్ లో ఈ కార్డును ఎప్పుడూ చూసి ఉండరు కదా. కానీ ఇప్పుడు ఓ వుమెన్స్ ఫుట్‌బాల్‌ మ్యాచ్ లో ఈ కార్డు కనిపించింది. మరి ఇంతకీ రిఫరీ ఈ కార్డు ఎందుకు చూపించాడు?

అసలేంటీ వైట్ కార్డు

పోర్చుగల్ లో జరిగిన ఓ మహిళల మ్యాచ్ లో ఈ వైట్ కార్డు కనిపించింది. బెన్ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ మధ్య ఆ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా రిఫరీ సడెన్ గా తన జేబులో నుంచి ఓ వైట్ కార్డు తీసి చూపించాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యంతోపాటు ఆనందానికి కూడా గురయ్యారు. రిఫరీ చేసిన పనిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు, అరుపులతో ప్రశంసించారు.

1970 ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఫుట్‌బాల్‌ ఫీల్డ్ లో ఎల్లో, రెడ్ కార్డులను మనం చూస్తున్నాం. ప్లేయర్స్ ను శిక్షించడానికి ఈ కార్డులను వాడుతుండగా.. వైట్ కార్డును మాత్రం మంచి చేసిన వారిని మెచ్చుకునేందుకు వాడాలని నిర్ణయించారు. ఈ తాజా మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్ లో ఉన్న ఓ అభిమాని సడెన్ గా అస్వస్థతకు గురయ్యారు.

అది చూసిన రెండు జట్ల మెడికల్ టీమ్స్ హుటాహుటిన ఆ అభిమాని దగ్గరికి వెళ్లి చికిత్స అందించాయి. వాళ్ల క్రీడాస్ఫూర్తిని అభినందిస్తూ రిఫరీ వైట్ కార్డు చూపించాడు. ఓ మ్యాచ్ సందర్భంగా ఫెయిర్ ప్లే ఆడుతున్న టీమ్స్ ను అభినందిస్తూ ఈ వైట్ కార్డును ప్రవేశపెట్టారు. దీనివల్ల ఫీల్డ్ లో ఓ మంచి వాతావరణంలో మ్యాచ్ జరుగుతుందన్నది ఫిఫా ఉద్దేశం.

పోర్చుగల్ లో ఈ వైట్ కార్డును తొలిసారి పరిచయం చేశారు. దీంతోపాటు ఫిఫా ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిన చాలా మార్పులు ఫుట్‌బాల్‌ ను మరింత జనరంజకంగా మారుస్తున్నాయి. కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్‌లను తీసుకురావడం, ఎక్కువ స్టాపేజ్ సమయం ఇవ్వడంలాంటివి కూడా ఇందులో భాగమే.

Whats_app_banner

టాపిక్