Aus vs Eng: టెస్ట్ క్రికెట్ మొనగాడు స్మిత్.. మరో రికార్డు సొంతం
29 June 2023, 9:53 IST
- Aus vs Eng: టెస్ట్ క్రికెట్ మొనగాడు స్మిత్ అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అతడు మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో యాషెస్ టెస్టులో స్మిత్ 9 వేల పరుగుల మార్క్ అందుకున్నాడు.
స్టీవ్ స్మిత్
Aus vs Eng: టెస్ట్ క్రికెట్ లో స్టీవ్ స్మిత్ ను మించిన మరో బ్యాటర్ లేడని ఈ మధ్య విరాట్ కోహ్లి అన్న విషయం తెలుసు కదా. అతడు చెప్పింది వంద శాతం నిజమని మరోసారి నిరూపించాడు స్మిత్. ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో యాషెస్ టెస్ట్ తొలి రోజు 85 పరుగులతో అజేయంగా నిలిచిన స్మిత్..ఈ ఫార్మాట్ లో మరో రికార్డు క్రియేట్ చేశాడు.
టెస్ట్ క్రికెట్ లో స్మిత్ 9 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. మ్యాచ్ ల పరంగా అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ప్లేయర్ గా స్మిత్ హిస్టరీ క్రియేట్ చేశాడు. అదే ఇన్నింగ్స్ పరంగా చూస్తే స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ తన 99వ టెస్టులో 9 వేల రన్స్ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఇంత వరకూ ఈ రికార్డు ఉన్న బ్రియాన్ లారా (101 టెస్టులు)ను వెనక్కి నెట్టాడు.
అయితే ఇన్నింగ్స్ పరంగా చూస్తే ఇప్పటికీ అత్యంత వేగంగా 9 వేల రన్స్ చేసిన రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర పేరిట ఉంది. సంగక్కర 172వ ఇన్నింగ్స్ లో ఈ మైలురాయి అందుకోగా.. స్మిత్ 174వ ఇన్నింగ్స్ లో సాధించాడు. తొలి రోజు 42వ ఓవర్లో బెన్ స్టోక్స్ వేసిన బంతిని మిడ్ వికెట్ దిశగా బౌండరీకి తరలించిన స్మిత్.. 9 వేల పరుగులు పూర్తి చేశాడు.
యాషెస్ తొలి టెస్టులోనూ సెంచరీ చేసిన స్మిత్.. రెండో టెస్టులోనూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. తొలి రోజు 85 పరుగులతో అజేయంగా ఉన్న అతడు.. రెండో రోజు మూడంకెల స్కోరుపై కన్నేశాడు. వార్నర్ (66), లబుషేన్ (45), ట్రావిస్ హెడ్ (77) కూడా రాణించడంతో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 339 పరుగులు చేసింది.