Ashes Series: నువ్వు ఏడవడం మేము చూశాం.. స్టీవ్ స్మిత్‌తో ఆడుకున్న ఇంగ్లండ్ ఫ్యాన్స్-ashes series as england fans brutally trolls steve smith ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashes Series: నువ్వు ఏడవడం మేము చూశాం.. స్టీవ్ స్మిత్‌తో ఆడుకున్న ఇంగ్లండ్ ఫ్యాన్స్

Ashes Series: నువ్వు ఏడవడం మేము చూశాం.. స్టీవ్ స్మిత్‌తో ఆడుకున్న ఇంగ్లండ్ ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu
Jun 20, 2023 03:13 PM IST

Ashes Series: నువ్వు ఏడవడం మేము చూశాం అంటూ స్టీవ్ స్మిత్‌తో ఆడుకున్నారు ఇంగ్లండ్ ఫ్యాన్స్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఈ ఘటన జరిగింది.

స్టీవ్ స్మిత్
స్టీవ్ స్మిత్ (AP)

Ashes Series: యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగో రోజు ఆటలో స్టీవ్ స్మిత్ తో ఆడుకున్న ఇంగ్లండ్ ఫ్యాన్స్. ది బార్మీ ఆర్మీగా తమను తాము పిలుచుకునే ఈ అభిమానులు తమ జట్టుకు మద్దతిస్తూనే ప్రత్యర్థులను మాటలతో వేధిస్తారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వాళ్ల హేళనకు గురయ్యాడు.

స్మిత్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలోని అభిమానులంతా ఓ పాట పాడటం ప్రారంభించారు. "స్టీవ్ వి సా యు క్రై ఆన్ ద టెలీ (స్టీవ్ నువ్వు టీవీలో ఏడవడం మేము చూశాం)" అనే పదాలను ఓ పాట రూపంలో పాడుతూ స్మిత్ తో ఆడుకున్నారు. ప్రత్యర్థులను ఆట పట్టించడానికి, వాళ్లను రెచ్చగొట్టడానికి ఈ బార్మీ ఆర్మీ ఎప్పుడూ ముందుంటుంది.

స్మిత్‌ ఎందుకు ఏడ్చాడు? అసలేం జరిగింది?

తాజాగా స్మిత్ కు కూడా అదే అనుభవం ఎదురైంది. ఇంతకీ వాళ్లు స్మిత్ ను అలా ఎందుకు ఏడిపించారో తెలుసా? 2018లో సాండ్‌పేపర్ గేట్ జరిగిన సమయంలో తప్పు చేశానంటూ తర్వాత స్మిత్ మీడియా ముందు కంటతడి పెట్టాడు. సౌతాఫ్రికాతో సిరీస్ లో బాల్ టాంపరింగ్ చేస్తూ ఆస్ట్రేలియా ప్లేయర్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో జట్టు కెప్టెన్ గా స్మిత్ ఉండగా.. వైస్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఈ బాల్ టాంపరింగ్ ఉదంతంలో అడ్డంగా కెమెరాలకు దొరికిపోయిన తర్వాత స్మిత్, వార్నర్ లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. జీవితాంతం వాళ్లు కెప్టెన్సీ చేపట్టకుండా చేసింది. ఆ ఘటనను గుర్తు చేస్తూ స్మిత్ ను ఏడిపించారు బార్మీ ఆర్మీ ఫ్యాన్స్.

స్టేడియంలో ఫ్యాన్స్ అందరూ అలా ఒక్కసారిగా తనను టీజ్ చేయడం చూసిన స్మిత్ కు ఏం చేయాలో పాలుపోలేదు. వాళ్లను చూస్తూ అలా నవ్వుతూ ఉండిపోయాడు. అయితే ఇంగ్లండ్ అభిమానులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ వ్యక్తి తాను చేసిన తప్పును తెలుసుకొని, పశ్చాత్తాప పడుతున్నా ఇలా హేళన చేయడం సరికాదని ట్వీట్లు చేస్తున్నారు.

మరోవైపు యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ గెలవాలంటే ఆస్ట్రేలియా 281 పరుగులు చేయాల్సి ఉండగా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. స్మిత్ కేవలం 6 పరుగులు చేసి ఔటయ్యాడు.

Whats_app_banner

సంబంధిత కథనం