Steve Smith Record: సెంచరీతో పాంటింగ్, కోహ్లి రికార్డులు బ్రేక్ చేసిన స్టీవ్ స్మిత్
Steve Smith Record: సెంచరీతో పాంటింగ్, కోహ్లి రికార్డులు బ్రేక్ చేశాడు స్టీవ్ స్మిత్. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు 95 పరుగులతో అజేయంగా నిలిచిన స్మిత్.. రెండో రోజు రెండో ఓవర్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు.
Steve Smith Record: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీతో మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిల రికార్డు బ్రేక్ చేశాడు. ఈ ఫైనల్లో తొలి రోజు 95 పరుగులతో అజేయంగా నిలిచిన స్మిత్.. రెండో రోజు రెండో ఓవర్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు.
టెస్టుల్లో స్మిత్ కు ఇది 31వ సెంచరీ కావడం విశేషం. కెరీర్లో 97వ టెస్ట్ ఆడుతున్న స్మిత్.. ఈ రేంజ్ లో సెంచరీల మోత మోగించడం నిజంగా విశేషమే. ఈ క్రమంలో అతడు పాంటింగ్, కోహ్లిలను వెనక్కి నెట్టాడు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా ప్లేయర్ గా స్మిత్ నిలిచాడు.
స్మిత్ ఇప్పటి వరకూ ఇండియాపై 19 టెస్టులు, 36 ఇన్నింగ్స్ లో 9 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లి, రికీ పాంటింగ్ లు చెరో 8 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ లిస్టులో ఓవరాల్ గా 11 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు ఆస్ట్రేలియాపై 39 టెస్టుల్లో 11 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ట్రావిస్ హెడ్ తో కలిసి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు స్టీవ్ స్మిత్. తొలి ఇన్నింగ్స్ లో 76 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ జట్టును హెడ్ తో కలిసి ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు ఏకంగా 285 పరుగులు జోడించారు. రెండో రోజు హెడ్ 163 పరుగులు చేసిన తర్వాత సిరాజ్ బౌలింగ్ లో ఔటవడంతో వీళ్ల పార్ట్‌నర్‌షిప్ కు బ్రేక్ పడింది.
సంబంధిత కథనం