David Warner: రిటైర్మెంట్ గురించి ప్రకటించిన డేవిడ్ వార్నర్: వివరాలివే
David Warner Retirement: టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ గురించి ప్రకటించాడు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్. తాను చివరగా ఆడాలనుకుంటున్న మ్యాచ్ ఏదో పేర్కొన్నాడు.
David Warner Retirement: ఇండియాతో మరో నాలుగు రోజుల్లో (జూన్ 7 నుంచి) ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ ఆడనుంది ఆస్ట్రేలియా. ఈ తరుణంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్.. టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ గురించి ప్రకటన చేశాడు. రానున్న ఆస్ట్రేలియన్ సమ్మర్ తర్వాత టెస్టు క్రికెట్‍కు వీడ్కోలు చెబుతానని అన్నాడు. అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో టెస్టు క్రికెట్‍కు గుడ్‍బై చెప్పనున్నాడు వార్నర్. అలాగే, 2024 ప్రపంచ కప్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ కు కూడా వీడ్కోలు పలుకుతాననేలా కామెంట్లు చేశాడు. తాను చివరి టెస్టును సొంతగడ్డపై ఆడాలనుకుంటున్నట్టు తెలిపాడు. పూర్తి వివరాలివే..
2024 జనవరిలో పాకిస్థాన్‍తో సిడ్నీలో జరిగే మ్యాచ్‍తో తన టెస్టు కెరీర్ ముగించాలని ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ నిర్ణయించుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాత రిటైర్ అవుతానని వెల్లడించాడు. ప్రస్తుతం లండన్‍లో ఇండియాతో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ కోసం సన్నద్ధం అవుతున్న వార్నర్.. ఈ టెస్టు రిటైర్మెంట్ బాంబ్ పేల్చాడు. బెకెన్‍హామ్‍లో రిపోర్టర్లతో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పాడు.
“హోం గ్రౌండ్ సిడ్నీలో జనవరిలో పాకిస్థాన్‍తో జరిగే ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత టెస్టు క్రికెట్‍కు నేను వీడ్కోలు పలకాలనుకుంటున్నా” అని రిపోర్టర్లతో వార్నర్ అన్నాడు. అయితే, వెస్టిండీస్, అమెరికాల్లో సంయుక్తంగా జరిగే 2024 ప్రపంచకప్ వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.
“జట్టులో ఉండాలంటే స్కోర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎప్పుడూ చెబుతున్నా.. ప్రపంచకప్ (2024) నా చివరి గేమ్ కావొచ్చు” అని వార్నర్ అన్నాడు. అంటే జనవరిలో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకొని.. అనంతరం ప్రపంచకప్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ కూడా వీడ్కోలు పలుకుతాననేలా సంకేతాలు ఇచ్చాడు.
కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్‍తో ఈ ఏడాది జరిగే యాషెస్‍పై పూర్తి దృష్టి సారించనున్నాడు వార్నర్. అందుకే వెస్టిండీస్ సిరీస్ ఆడబోనని చెప్పాడు. అయితే, ప్రస్తుతం తుది జట్టులో తనకు చోటు దక్కుతుందనే నమ్మకం లేదని వార్నర్ అంగీకరించాడు. ఇటీవల టెస్టుల్లో వార్నర్ అసలు ఫామ్‍లో లేడు. మొత్తంగా వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‍తో సిడ్నీలో జరిగే మ్యాచే డేవిడ్ వార్నర్‌కు చివరి టెస్టు కానుంది.
2011 డిసెంబర్ 1న టెస్టు క్రికెట్‍లో అరంగేట్రం చేశాడు డేవిడ్ వార్నర్. మొత్తంగా ఇప్పటి వరకు 103 టెస్టులు ఆడాడు. 45.57 సగటుతో 8,158 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 335 (నాటౌట్)గా ఉంది. టెస్టు క్రికెట్‍లో 25 సెంచరీలు, 34 అర్ధ శతకాలు సాధించాడు వార్నర్. 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదం వార్నర్ కెరీర్‌లో మాయని మచ్చగా ఉంది. బ్యాల్ ట్యాంపరింగ్ వల్ల ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి సంవత్సరం నిషేధాన్ని వార్నర్ ఎదుర్కొన్నాడు.