తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashwin On Dhawan: రోహిత్, కోహ్లిల కంటే శిఖర్ ధావన్ తక్కువేమీ కాదు: అశ్విన్

Ashwin on Dhawan: రోహిత్, కోహ్లిల కంటే శిఖర్ ధావన్ తక్కువేమీ కాదు: అశ్విన్

Hari Prasad S HT Telugu

01 February 2023, 18:04 IST

google News
    • Ashwin on Dhawan: రోహిత్, కోహ్లిల కంటే శిఖర్ ధావన్ తక్కువేమీ కాదని అన్నాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. టీమిండియా ఓపెనర్ పై ప్రశంసలు కురిపించాడు.
శిఖర్ ధావన్ పై ప్రశంసలు కురిపించిన అశ్విన్
శిఖర్ ధావన్ పై ప్రశంసలు కురిపించిన అశ్విన్ (ICC Twitter)

శిఖర్ ధావన్ పై ప్రశంసలు కురిపించిన అశ్విన్

Ashwin on Dhawan: శిఖర్ ధావన్.. టీమిండియాలో ఒకప్పుడు ఎంతో కీలకమైన ప్లేయర్. అంతెందుకు గతేడాది కూడా టీమ్ ఆడిన 24 వన్డేల్లో ఏకంగా 22 ఆడాడు. అందులో 9 మ్యాచ్ లకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కంటే కూడా ఒకటి ఎక్కువే. అలాంటి ప్లేయర్ ఈ ఏడాది ఒక్క మ్యాచ్ లో కూడా లేడు. 2022లో ధావన్ 688 రన్స్ చేశాడు.

నిజానికి ఇవి తక్కువేనేమోగానీ మరీ టీమ్ లో స్థానం కోల్పోయేంత తక్కువైతే కాదు. గతేడాది రోహిత్, కోహ్లిలాంటి వాళ్లు టీమ్ లో రెగ్యులర్ గా లేకపోవడంతో ధావన్ కు ఎక్కువ అవకాశాలు దక్కాయి. ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి అతన్ని పక్కన పెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్ ఇక వన్డేల నుంచి కూడా ధావన్ ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ రాణిస్తుండటంతో ధావన్ టీమ్ లోకి రావడం ఇక కష్టమే.

అయితే స్పిన్నర్ అశ్విన్ మాత్రం ధావన్ పై ప్రశంసలు కురిపించాడు. రోహిత్, కోహ్లిల కంటే తక్కువేమీ కాదని అనడం విశేషం. "గతంలో టాప్ 3 బ్యాటర్లు విఫలమైనప్పుడే మనకు సమస్యలు ఎదురయ్యాయి. ధావన్, రోహిత్, విరాట్. మనం రోహిత్, కోహ్లిల గురించి మాట్లాడుకున్నాం. కానీ ధావన్ కూడా హీరోనే. అతడు సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. టీమిండియాలో అతని లేని లోటు పూడ్చగలమా?" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో అన్నాడు.

గిల్, ఇషాన్ లాంటి యువ ఆటగాళ్లు రాణిస్తుండటంతో ధావన్ ను పక్కన పెడుతున్నారు. ఈ ఇద్దరూ ఈ మధ్య కాలంలో వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టడంతో ధావన్ ను ఇటు ఫ్యాన్స్ కూడా మరచిపోయారు. టాపార్డర్ లో ప్రస్తుతం ఉన్న పోటీ గురించి కూడా అశ్విన్ ఈ సందర్భంగా మాట్లాడాడు.

"మనం శిఖర్ ధావన్ ను మళ్లీ తీసుకొద్దామా లేక ఇషాన్ కిషన్ నే మరింత రాటుదేల్చుదామా? ఒక్క భారీ స్కోరు చూసి ఓ ప్లేయర్ ను వెనుకేసుకు రావడం కంటే టీమ్ కు ఏది అవసరమో చూడాలి. ఒత్తిడిలో ఎవరు ఆడతారు? సుదీర్ఘ కాలం ఎవరు ఉపయోగపడతారు?

ఇషాన్ డబుల్ సెంచరీ చేసినా తర్వాతి మ్యాచ్ లో స్థానం కోల్పోయాడు. గతంలో గిల్ ను కూడా చూశాం. కొంతకాలంగా గిల్ నిలకడగా పరుగులు చేస్తున్నాడు. స్మార్ట్ బ్యాటింగ్, క్వాలిటీ బ్యాటింగ్ చేయగలడు. చివర్లో ఇన్నింగ్స్ వేగం పెంచగలడు" అని అశ్విన్ అన్నాడు.

తదుపరి వ్యాసం