Rohit or Dhoni: ఐపీఎల్ ఆల్ టైమ్ లెవన్ టీమ్‌కు కెప్టెన్ ఎవరు.. రోహిత్ లేక ధోనీ.. మీ ఓటు ఎవరికి?
27 January 2023, 13:50 IST
- Rohit or Dhoni: ఐపీఎల్ ఆల్ టైమ్ లెవన్ టీమ్‌కు కెప్టెన్ గా ఎవరు ఉండాలి? రోహిత్ శర్మనా లేక ధోనీయా? ఈ విషయంలో మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓజా, సురేశ్ రైనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు?
ధోనీ, రోహిత్ శర్మ
Rohit or Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఐదుసార్లు టైటిల్ గెలవగా.. చెన్నై నాలుగుసార్లతో రెండోస్థానంలో ఉంది. ఈ రెండు టీమ్స్ ను ఇండియన్ క్రికెట్ పై చెరగని ముద్ర వేసిన రోహిత్ శర్మ, ఎమ్మెస్ ధోనీలాంటి క్రికెటర్లు నడిపిస్తున్నారు.
గతంలో టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ధోనీ నిలవగా.. ఇప్పుడు రోహిత్ ఆ పని చేస్తున్నాడు. మరి ఐపీఎల్లో ఆల్ టైమ్ లెవన్ కు కెప్టెన్ గా ఈ ఇద్దరిలో ఎవరు ఉండాలి అన్న చర్చ సహజంగానే ఎంతో ఆసక్తి రేపుతుంది. జియోసినిమాలో చర్చ సందర్భంగా హిందీ ప్యానలిస్టులుగా ఉన్న ఓజా, రాబిన్ ఉతప్ప, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్, ఆర్పీ సింగ్, ఆకాశ్ చోప్రాలు తమ ఆల్ టైమ్ ఐపీఎల్ లెవన్ ను ఎంపిక చేశారు.
అయితే ఈ టీమ్ కు కెప్టెన్ గా ధోనీ బదులు రోహిత్ శర్మకే ఓటేశాడు ఓజా. ఈ టీమ్ ఓపెనర్లుగా గతంలో ఆర్సీబీకి కలిసి ఓపెనింగ్ చేసిన క్రిస్ గేల్, విరాట్ కోహ్లిలను ఎంపిక చేశారు. ఇక మూడోస్థానం కోసం చర్చ జరగగా.. కేఎల్ రాహుల్ పేరు తెరపైకి వచ్చింది. ఆకాశ్ చోప్రా, ఆర్పీ సింగ్ లు రాహుల్ కు ఓటు వేయగా.. ఉతప్ప మాత్రం.. రాహుల్ నిలకడగా ఆడలేకపోయాడని అన్నాడు.
అతడు కాల పరీక్షకు నిలవలేకపోయాడని ఉతప్ప వాదించాడు. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నాడు. దీంతో ప్యానలిస్టులలో ఒకడిగా ఉన్న సురేశ్ రైనా పేరే ఈ మూడోస్థానానికి ఖరారు చేశారు. నాలుగో స్థానంలో రోహిత్ శర్మ, ఐదో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఆరో స్థానంలో ఎమ్మెస్ ధోనీ ఉన్నారు. ఈ టీమ్ కెప్టెన్ విషయంలోనూ ప్యానెల్లో వాదనలు జరిగాయి.
అయితే ధోనీ కంటే ఎక్కువ టైటిల్స్ గెలిచిన రోహిత్ వైపే ఓజా మొగ్గు చూపాడు. "ఇద్దరినీ పోల్చి చూస్తే ఒకేలా అనిపిస్తారు. ఇద్దరూ బౌలర్ల కెప్టెన్లే. అందుకే కేవలం టైటిల్స్ పరంగా వెళ్తున్నాను. ఇక్కడ ధోనీ కంటే రోహిత్ కే ఎక్కువ టైటిల్స్ ఉన్నాయి. 15 ఏళ్లలో ఐదు టైటిల్స్ గెలవడం సాధారణ విషయం కాదు" అని ఓజా అన్నాడు.
ఇక ఈ ఆల్ టైమ్ లెవన్ లో ఏడో స్థానంలో జడేజా స్థానంలో డ్వేన్ బ్రావో రావడం విశేషం. జడేజా 8వస్థానం కోసం కూడా పోటీ ఉన్నా.. అది హర్భజన్ కు దక్కింది. భజ్జీ 163 ఐపీఎల్ మ్యాచ్ లలో 150 వికెట్లు తీసుకున్నాడు. రెండో స్పిన్నర్ గా యుజువేంద్ర చహల్ నిలిచాడు. పేస్ బౌలర్లుగా బుమ్రా, లసిత్ మలింగ ఉన్నారు. అయితే ఐపీఎల్ లో తమదైన ముద్ర వేసిన పొలార్డ్, భువనేశ్వర్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, యువరాజ్ సింగ్, జడేజాలాంటి ప్లేయర్స్ ఈ టీమ్ లో చోటు సంపాదించలేకపోయారు.