Robin Uthappa on One Day Cricket: ఏడు గంటలు కూర్చొని వన్డే మ్యాచ్ చూసే టైమ్ ఎవరికీ లేదు: ఉతప్ప
Robin Uthappa on One Day Cricket: ఏడు గంటలు కూర్చొని వన్డే మ్యాచ్ చూసే టైమ్ ఎవరికీ లేదని అన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప. ఇక భవిష్యత్తు అంతా టీ20, టీ10 క్రికెట్ దే అని అతడు స్పష్టం చేశాడు.
Robin Uthappa on One Day Cricket: టీ20 క్రికెట్ మొదలైనప్పుడే వన్డే ఫార్మాట్ పై ప్రశ్నలు మొదలయ్యాయి. ముచ్చటగా మూడు గంటల్లో ముగిసిపోయే టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత రోజంతా కూర్చొని వన్డే క్రికెట్ ఎవరు చూస్తారన్న ప్రశ్న అప్పుడే చాలా మంది లేవనెత్తారు. సాయంత్రం వేళ సరదాగా ఓ సినిమా చూసినట్లుగా ఈ టీ20 క్రికెట్ చూడటం అభిమానులకు అలవాటైంది.
పైగా ఈ ఫార్మాట్ లోని ఫోర్లు, సిక్స్ ల మజాను బాగా ఆస్వాదిస్తున్నారు. దీంతో గత 15 ఏళ్ల కాలంలో వన్డే క్రికెట్ కు క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఎందరో మాజీ క్రికెటర్లు కూడా 50 ఓవర్ల ఫార్మాట్ ఇక కనుమరుగు కావడం ఖాయమని అన్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ఇక భవిష్యత్తు మొత్తం టీ20, టీ10 లీగ్స్ దే అని స్పష్టం చేశాడు.
"నాకు తెలిసి క్రికెట్ ఆ దిశగానే పరిణామం చెందుతోంది. అంతేకాదు వ్యూయర్‌షిప్ కూడా శాసిస్తోంది. ఏది ఆదరణ పొందుతుందో, ఏది కనుమరుగవుతుందో తేల్చేది కూడా ఇదే. ఇలాంటి పరిణామం కూడా సహజంగా జరిగేదే. అందుకే టీ20 క్రికెట్ ఇప్పుడు రాజ్యమేలుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని టీ10 లీగ్స్ కూడా వస్తాయన్నది నా నమ్మకం. అంతేకాదు క్రికెట్ ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న జర్మనీ, చైనాలాంటి అసోసియేట్ దేశాల్లో టీ10 బాగా ఆకర్షిస్తుంది" అని ఉతప్ప అన్నాడు.
ప్రస్తుతం ఉతప్ప యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ కు ఆడుతున్న విషయం తెలిసిందే. "ప్రస్తుతం క్రికెట్ ఆ దిశగానే వెళ్తోంది. 50 ఓవర్ల క్రికెట్ విషయానికి వస్తే ప్రస్తుతం మనం ఉంటున్న ప్రపంచంలో ఒక రోజులో ఏడు గంటలు వెచ్చించి మ్యాచ్ చూసేంత సమయం ఎవరికి ఉంది? స్టేడియమనే కాదు ఇంట్లోనూ అంత సమయం ఇవ్వలేరు.
దీంతో వ్యూయర్‌షిప్ కూడా తగ్గుతుంది. ఇప్పుడున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ) తర్వాత వన్డే క్రికెట్ నుంచి అందరూ మెల్లగా టీ20, టీ10 క్రికెట్ వైపు వెళ్తారు. అయితే అక్కడే ఆగిపోవాలి. అంతకంటే తక్కువ ఓవర్ల క్రికెట్ ఉండకూడదు" అని ఉతప్ప అన్నాడు.
సంబంధిత కథనం