Ruturaj Gaikwad Ruled Out: ఇండియన్ క్రికెట్ టీమ్ కు గాయాల బెడద కొనసాగుతూనే ఉంది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు ముందు శ్రేయస్ అయ్యర్ ఇలాగే దూరం కాగా.. ఇప్పుడు టీ20 సిరీస్ కు స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా దూరమయ్యాడు. మణికట్టు గాయానికి గురి కావడంతో అతడు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్ కోసం వెళ్లాడు.
చివరిసారి గైక్వాడ్.. మహారాష్ట్ర, హైదరాబాద్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఆడాడు. అయితే ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లో అతడు కేవలం 8, 0 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత తన మణికట్టు గాయం గురించి అతడు బీసీసీఐకి తెలిపాడు. గతేడాది కూడా ఇలా మణికట్టు గాయంతోనే శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు.
ఇక కొవిడ్ బారిన పడి వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ కూడా ఆడలేకపోయాడు. దీంతో వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు రుతురాజ్ సిరీస్ నుంచి ఔటవడంతో.. చాలా రోజుల తర్వాత తిరిగి టీమ్ లోకి వచ్చిన పృథ్వీ షాకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు మెరుగయ్యాయి.
మరోవైపు ఆస్ట్రేలియాతో వచ్చే నెలలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన రవీంద్ర జడేజాకు ఆ సిరీస్ ప్రారంభానికి ముందే ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న దీనిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. మోకాలి గాయం కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి జడేజా టీమ్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున తమిళనాడుతో మ్యాచ్ ఆడుతున్నాడు.
సంబంధిత కథనం