ఏం దురదృష్టమో.. గానీ.. దేశవాళీ క్రికెట్లో అద్భుతాలు సృష్టిస్తున్న సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) టీమిండియా(Team India)లోకి ఇంకా రాలేకపోతున్నాడు. ఎంత ఆడినా సెలక్టర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అతడికి నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. కావాలనే పక్కన పెడుతున్నారని కూడా అంటున్నారు. అయితే తాజాగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కూడా.. సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడాడు.
మూడు సీజన్లుగా రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా రాణిస్తున్నాడని అశ్విన్ అన్నాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో సెలెక్టర్ల డోర్లు బద్దలు కొట్టాడని వ్యాఖ్యానించాడు. ఓ యూట్యూబ్ చానెల్ వేదికగా అశ్విన్ ఈ కామెంట్స్ చేశాడు. ' సర్ఫరాజ్ గురించి ఏమని, ఎక్కడ అని మెుదలుపెట్టాలి? అతడు టీమిండియాకు సెలక్ట్ అవుతాడా? కాడా? అన్న అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అతడికి మాత్రం ఇవేమీ పట్టవు.' అని అశ్విన్ అన్నాడు.
సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) 2019-20 సీజన్‌లో 900 పరుగులు చేశాడని అశ్విన్ అన్నాడు. 2020-21 సీజన్‌లో సైతం 900 పరుగులు చేశాడని.., ఈసారి సుమారుగా 600 రన్స్ చేశాడని,.. తన అత్యద్భుత ప్రదర్శనతో సెలక్టర్లకు గట్టి సవాల్ విసురుతున్నాడని అశ్విన్ అన్నాడు. సర్ఫరాజ్ సెలక్టర్లకు తలనొప్పి మాత్రమే కాదు.. కోపం కూడా తెప్పిస్తున్నాడని పేర్కొన్నాడు.
'మూడు సీజన్లలో సర్ఫరాజ్ స్ట్రైక్ రేటు బాగుంది. సగటు 100కి పైగానే ఉంది. ప్రతీసారి మెరుస్తున్నాడు. అతడు కేవలం సెలక్షన్ కమిటీ డోర్లను బాదడం కాదు.. సెలక్టర్లకు ఓ రకంగా కోపం తెప్పించేలా తలనొప్పిలా తయారయ్యాడు.' అని అశ్విన్ అన్నాడు.
అయితే ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్ కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక అవుతాడని ఆశలు పెట్టుకున్నాడు. కానీ నిరాశ ఎదురైంది. ఇది అతడి అభిమానులకు సైతం కోపం తెప్పించింది. ఇషాన్ కిషన్ కు అరంగేట్రం ఇవ్వడంతో సర్ఫరాజ్ సైడ్ అయిపోయాడు. దీంతో బీసీసీఐ(BCCI) సెలక్షన్ కమిటీ మీద ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు.