తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Arjun Tendulkar Debut: రెండేళ్ల నిరీక్షణకు తెర.. ఐపీఎల్‌లో అర్జున్ తెందూల్కర్ అరంగేట్రం.. టోర్నీ చరిత్రలోనే అరుదైన ఘనత

Arjun Tendulkar Debut: రెండేళ్ల నిరీక్షణకు తెర.. ఐపీఎల్‌లో అర్జున్ తెందూల్కర్ అరంగేట్రం.. టోర్నీ చరిత్రలోనే అరుదైన ఘనత

16 April 2023, 16:18 IST

google News
    • Arjun Tendulkar Debut: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన ఘనత నమోదైంది. అర్జున్ తెందూల్కర్ ఈ టోర్నీలో అరంగేట్రం చేశాడు. ఫలితంగా తండ్రి, కుమారులు ఒకే ఫ్రాంఛైజీకి ఆడి రికార్డు క్రియేట్ చేశారు. సచిన్ కూడా పదేళ్ల క్రితం ముంబయి తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
అర్జున్ తెందూల్కర్
అర్జున్ తెందూల్కర్ (PTI)

అర్జున్ తెందూల్కర్

Arjun Tendulkar Debut: ఏ రంగంలోనైనా శిఖరాగ్రంలో ఉన్న తండ్రి లెగసీని అలాగే కొనసాగించడం అంత సులభం కాదు. వారిపై చాలా ఒత్తిడి నెలకొని ఉంటుంది. క్రికెట్‌లో అయితే ఈ పరిస్థితి ఇంకా కష్టంగా ఉంటుంది. తండ్రి దిగ్గజం అయినంత మాత్రాన కుమారుడిని కూడా అదే స్థాయిలో ఆడతాడని, అతడి నుంచి అలాంటి ప్రదర్శన కోసం చూడటం సరికాదు. అలా వచ్చినవారు ఒత్తిడి కారణంగా పెద్దగా రాణించలేకపోయినవాళ్లు ఉన్నారు. ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్ ఇదే జాబితాకు చెందుతాడు. రెండేళ్లుగా ఐపీఎల్‌లో అరంగేట్రం చేయాలని చూస్తున్న అర్జున్‌ కల ఎట్టకేలకు నెరవేరింది. ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆతడు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తుది జట్టులో ఎంపికయ్యాడు.

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కడుపు నొప్పి కారణంగా కోల్‌కతా మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ బాధ్యతలను తీసుకున్నాడు. అంతేకాకుండా రోహిత్ ప్లేస్‌లో అర్జున్ తెందూల్కర్‌కు అవకాశం కల్పించాడు. ఫలితంగా ఐపీఎల్‌లో తన డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నాడు మన లిటిల్ మాస్టర్. 2021 ఐపీఎల్ వేలంలో ముంబయి అర్జున్‌ను తన బేస్ ప్రైజ్‌కు సొంతం చేసుకున్నప్పటి నుంచి ఇంతవరకు అరంగేట్రం మాత్రం చేయలేదు. తాజాగా అర్జున్ కల నెరవేరింది.

కోల్‌కతా మ్యాచ్‌తో ముంబయి తరఫున అర్జున్ అరంగేట్రం చేయడమే కాకుండా అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తండ్రి, కుమారులు ఒకే ఫ్రాంఛైజీకి ఆడటం ఇదే తొలిసారి. పదేళ్ల క్రితం సచిన్ కూడా ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. తాజాగా అర్జున్ కూడా అదే ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్ వేదికగా స్పందించాడు.

"తండ్రి, కుమారుడు 10 సంవత్సరాల నుంచి ఒకే ఫ్రాంఛైజీకి మారారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గుడ్ లక్ అర్జున్ తెందూల్కర్." అని భారత మాజీ ఇర్ఫాన్ పఠాన్ తన ట్విటర్ ద్వారా విషెస్ చెప్పాడు.

ప్రస్తుతం కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనింగ్ బౌలర్‌గా అర్జున్ బౌలింగ్ చేశాడు. అతడు వేసిన ఐపీఎల్ తొలి ఓవర్లో కేవలం 5 పరుగులే ఇచ్చాడు. రెండో ఓవర్లో 12 పరుగులిచ్చి మొత్తంగా 2 ఓవర్లకు 17 పరుగులు ఇచ్చాడు. కేకేఆర్ ప్రస్తుతం దూకుడుగా ఆడుతోంది.

తదుపరి వ్యాసం