LSG vs PBKS: ఐపీఎల్‌లో సికిందర్ రజా రికార్డ్ - లక్నోను ఓడించిన పంజాబ్
LSG vs PBKS: సికిందర్ రజా, షారుఖ్‌ఖాన్ బ్యాటింగ్ మెరుపులతో శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
LSG vs PBKS: సికిందర్ రజా హాఫ్ సెంచరీతో రాణించడంతో లక్నోపై రెండు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయాన్ని సాధించింది. లాస్ట్ ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు పంజాబ్‌నే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేసింది.
గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు. 56 బాల్స్ లో ఎనిమిది ఫోర్లు ఒక సిక్సర్‌తో 74 రన్స్ చేశాడు. రాహుల్ తర్వాత కైల్ మేయర్స్ 29 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలం కావడం లక్నో మోస్తారు స్కోరు చేసింది.
లక్ష్య ఛేదన పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ అథర్వ వికెట్‌ను పంజాబ్ కోల్పోయింది. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఈ తరుణంలో మాథ్యూషార్ట్, హర్‌ప్రీత్ భాటియా కలిసి పంజాబ్ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు.
హర్‌ప్రీత్ ఔటైన తర్వాత బ్యాటింగ్ దిగిన సికిందర్ రజా హాఫ్ సెంచరీతో పంజాబ్‌ను విజయం దిశగా నడిపించాడు. 41 బాల్స్‌లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 57 రన్స్ చేశాడు రజా. ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఫస్ట్ జింబాబ్వే ప్లేయర్‌గా రజా రికార్డ్ క్రియేట్ చేశాడు.
కానీ కీలక సమయంలో రజాతో పాటు సామ్ కరన్, జితేన్ శర్మ వికెట్లను కోల్పోవడంతో పంజాబ్ గెలవడం కష్టంగానే మారింది. షారుఖ్‌ఖాన్ (10 బాల్స్‌లో రెండు సిక్సర్లు ఒక ఫోర్‌తో 23 రన్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లు యుధ్‌వీర్ సింగ్, రవి బిష్ణోయ్, మార్క్‌వుడ్ తలో రెండు వికెట్లతో రాణించారు.