Argentina Football Team: సాహో అర్జెంటీనా.. 16వసారి కోపా అమెరికా టైటిల్ గెలిచిన మెస్సీ సేన
15 July 2024, 10:21 IST
- Argentina Football Team: అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ రికార్డు స్థాయిలో 16వ కోపా అమెరికా టైటిల్ సొంతం చేసుకుంది. ఆదివారం (జులై 14) రాత్రి జరిగిన ఫైనల్లో కొలంబియాను చిత్తు చేసింది.
సాహో అర్జెంటీనా.. 16వసారి కోపా అమెరికా టైటిల్ గెలిచిన మెస్సీ సేన
Argentina Football Team: అర్జెంటీనా చరిత్ర సృష్టించింది. అత్యధికసార్లు కోపా అమెరికా టైటిల్స్ గెలిచిన జట్టుగా నిలిచింది. ఆదివారం (జులై 14) రాత్రి అమెరికాలోని మియామీలో ఉన్న హార్డ్ రాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0తో ఓడించింది. అర్జెంటీనాకు ఇది 16వ కోపా అమెరికా టైటిల్ కావడం విశేషం. ఈ క్రమంలో ఆ టీమ్ ఉరుగ్వే రికార్డును బ్రేక్ చేసింది.
అర్జెంటీనా సరికొత్త చరిత్ర
సౌత్ అమెరికా ఫుట్‌బాల్ లో అత్యున్నత టోర్నీ అయిన కోపా అమెరికా టైటిల్ ను మరోసారి సొంతం చేసుకుంది అర్జెంటీనా. ఆ టీమ్ ప్లేయర్ లాటారో మార్టినెజ్ 111వ నిమిషంలో చేసిన గోల్ తో 1-0తో కొలంబియాను చిత్తు చేసింది. కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ గాయం కారణంగా మధ్యలోనే బయటకు వెళ్లిపోయినా.. అర్జెంటీనా చిరస్మరణీయ విజయం సాధించింది.
2020లో జరిగిన కోపా అమెరికా టైటిల్ కూడా గెలిచిన అర్జెంటీనా.. ఇప్పుడు తన టైటిల్ నిలబెట్టుకుంది. అంతేకాదు మధ్యలో 2022లో వరల్డ్ కప్ కూడా గెలిచిన విషయం తెలిసిందే. 1986 తర్వాత ఆ టీమ్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ రెగ్యులర్ టైమ్ లో రెండు టీమ్స్ గోల్స్ చేయలేకపోయాయి. 90 నిమిషాల తర్వాత 0-0తో నిలవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది.
మెస్సీ కంటతడి
అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ సెకండాఫ్ లో గాయం కారణంగా అర్ధంతరంగా మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అతడు కంటతడి పెట్టాడు. మ్యాచ్ 64వ నిమిషంలో మెస్సీ కుడి కాలి మడమకు గాయమైంది. నొప్పితో అతడు గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. నొప్పి తీవ్రంగా వేధించడంతో అతడు ఏడుస్తూ గ్రౌండ్ బయటకు వెళ్లాడు.
అతని స్థానంలో నికొలస్ గొంజాలెజ్ వచ్చాడు. మ్యాచ్ లో ఎంతకీ గోల్ నమోదు కాకపోవడంతో రెండు టీమ్స్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. టికెట్ లేని అభిమానులు కూడా స్టేడియంలోకి దూసుకురావడానికి ప్రయత్నించడంతో అప్పటికే మ్యాచ్ గంట ఆలస్యమైంది. తర్వాత గ్రౌండ్లోనూ రెండు జట్ల ప్లేయర్స్ చాలా దూకుడుగా ఆడుతూ గోల్ కోసం ప్రయత్నించారు.
రెగ్యులర్ టైమ్ లో గోల్ నమోదు కాకపోవడంతో అదనపు సమయం తప్పలేదు. రెండో ఎక్స్‌ట్రా టైమ్ లో 111వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ మార్టినెజ్ విన్నింగ్ గోల్ చేశాడు. దీంతో అర్జెంటీనా 16వ కోపా అమెరికా టైటిల్ సొంతం చేసుకుంది. ఉరుగ్వే పేరిట 15 టైటిల్స్ తో ఉన్న రికార్డును ఇప్పుడు బ్రేక్ చేసి.. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.
2020లో గెలిచిన టైటిల్ తో ఉరుగ్వేను సమం చేసిన ఆ టీమ్.. ఇప్పుడా జట్టును అధిగమించింది. 9 కోపా అమెరికా టైటిల్స్ తో మరో టాప్ టీమ్ బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. ఈసారి ఉరుగ్వే మూడో స్థానంలో నిలిచింది.