FIFA Best Player Lionel Messi: ఫిఫా బెస్ట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ
FIFA Best Player Lionel Messi: అర్జెంటీనాను 26 ఏళ్ల తర్వాత మరోసారి విశ్వవిజేతగా నిలిపిన స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ.. 2023 ఏడాదికిగాను వరుసగా రెండోసారి ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు.
FIFA Best Player Lionel Messi: ఫుట్‌బాల్‌లో మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ. 2023 ఏడాదికిగాను ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. హాలాండ్ తో సమంగా పాయింట్లు సాధించిన మెస్సీ.. చివరికి టైబ్రేకర్ లో విజేతగా నిలవడం విశేషం. అయితే అవార్డు అందుకోవడానికి మాత్రం అతడు రాలేదు.
సోమవారం (జనవరి 15) ఈ అవార్డు కోసం జరిగిన ఓటింగ్ లో లియోనెల్ మెస్సీ, ఎర్లింగ్ హాలాండ్ లకు 48 పాయింట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ లో ఫుట్‌బాల్ జాతీయ జట్ల కెప్టెన్లు, కోచ్‌లు, ఎంపిక చేసిన జర్నలిస్టులు, ఆన్‌లైన్లో అభిమానులు పాల్గొంటారు. ఇద్దరీ సమంగా పాయింట్లు రావడం టైబ్రేకర్ అనివార్యమైంది. ఇందులో నేషనల్ కెప్టెన్ల నుంచి ఎవరికైతే ఎక్కువ 5 పాయింట్లు వచ్చాయో వాళ్లను విజేతగా తేల్చారు.
మెస్సీ వైపే కెప్టెన్లు
ఈ టైబ్రేకర్ లో మెస్సీయే విజేతగా నిలిచాడు. ఏకంగా 107-64తో హాలాండ్ ను వెనక్కి నెట్టాడు. అయితే ఈ అవార్డుల సెర్మనీకి మెస్సీ, హాలాండ్ తోపాటు మూడో స్థానంలో నిలిచిన కిలియన్ ఎంబాపె కూడా హాజరుకాకపోవడం గమనార్హం. గతేడాది ఈ ఇద్దరు ప్లేయర్స్ నే వెనక్కి నెట్టి రికార్డు స్థాయిలో 8వ సారి మెస్సీ బ్యాలన్ డోర్ అవార్డును కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఇక ఫిఫా బెస్ట్ వుమెన్ ప్లేయర్ అవార్డును స్పెయిన్ కు చెందిన ఐటానా బొన్మాటీ గెలుచుకుంది. గతేడాది బ్యాలన్ డోర్, యూఈఎఫ్ఏ అవార్డును కూడా బొన్మాటీనే సొంతం చేసుకోవడం విశేషం.
మెస్సీ గత 15 ఏళ్లలో 8వసారి ఫిఫా అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది కూడా అతనికే ఈ అవార్డు దక్కింది. 2022లో 26 ఏళ్ల తర్వాత అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన మెస్సీనే ఈ అవార్డు వరించింది. ఇక 2023లోనూ అతడు ప్రపంచ ఫుట్‌బాల్ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ ఓటింగ్ లో నేషనల్ టీమ్స్ కెప్టెన్లతోపాటు అభిమానులు కూడా మెస్సీవైపే ఉన్నారు.
అయితే జర్నలిస్టులు మాత్రం ఎక్కువ భాగం హాలాండ్ కు ఓటేశారు. ఇక నేషనల్ టీమ్ కోచ్ లు కూడా అతనికే మద్దతు తెలిపారు. 2022లో వరల్డ్ కప్ ముగిసినప్పటి నుంచి గతేడాది ఆగస్ట్ 20 మధ్య ప్లేయర్స్ ప్రదర్శనను బట్టి ఈ అవార్డును ప్రకటించారు. అంతకుముందు వరల్డ్ కప్ గెలిచిన ఏడాదిలోనూ మెస్సీనే ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.
పీఎస్‌జీ క్లబ్ ను వదిలి ఇంటర్ మియామీకి వెళ్లిన మెస్సీ.. యూఎస్ఏలో ఫుట్‌బాల్ కు ఓ రేంజ్ లో క్రేజ్ తీసుకొచ్చాడు. గతేడాది ఆగస్ట్ లో ఇంటర్ మియామీకి లీగ్స్ కప్ కూడా సాధించి పెట్టాడు. మరోవైపు మాంచెస్టర్ సిటీ తరఫున తొలి సీజన్ లోనే 52 గోల్స్ చేసిన హాలాండ్.. ఈ అవార్డుకు ఫేవరెట్ అనుకున్నా.. చివరికి టై బ్రేకర్ లో మెస్సీనే పైచేయి సాధించాడు.