Messi vs Ronaldo: మెస్సీ, రొనాల్డో ఫేస్ టు ఫేస్.. ఫుట్‌బాల్ సూపర్ మ్యాచ్ ఎప్పుడంటే?
Messi vs Ronaldo: మెస్సీ, రొనాల్డో ముఖాముఖి తలపడనున్నారు. ఈ సూపర్ ఫుట్‌బాల్ మ్యాచ్ సౌదీ అరేబియాలో ఇంటర్ మియామీ, అల్ నసర్ మధ్య జరగనుండటం విశేషం.
Messi vs Ronaldo: ఫుట్‌బాల్‌లో ఓ నోరూరించే మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో మోడర్న్ డే గ్రేట్స్ లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ముఖాముఖి తలపడబోతున్నారు. రియాద్ సీజన కప్ లో తాము కూడా ఆడబోతున్నట్లు సోమవారం (డిసెంబర్ 11) ఇంటర్ మియామీ టీమ్ అనౌన్స్ చేయడంతో ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.
లియోనెల్ మెస్సీ ఇంటర్ మియామీ తరపున ఆడుతుండగా.. రొనాల్డో సౌదీ క్లబ్ అల్ నసర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రియాద్ సీజన్ కప్ లో భాగంగా అల్ హిలాల్ టీమ్ తో జనవరి 29న ఇంటర్ మియామీ తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఇంటర్ మియామీ, అల్ నసర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లోనే మెస్సీ, రొనాల్డో ప్రత్యర్థులుగా ఆడనున్నారు.
మెస్సీ, రొనాల్డోల్లో ఎవరిది పైచేయి?
సౌదీ ప్రొ లీగ్ లో ప్రస్తుతం ఈ అల్ హిలాల్, అల్ నసర్ టీమ్సే లీడ్ లో ఉన్నాయి. ఇక ఈ లీగ్ టాప్ స్కోరర్ రొనాల్డో కావడం విశేషం. ఇప్పటి వరకూ మెస్సీ, రొనాల్డో క్లబ్, దేశం తరఫున కలిపి 35 సార్లు ముఖాముఖి తలపడ్డారు. అందులో 16 సార్లు మెస్సీ జట్లు గెలవగా.. రొనాల్డో టీమ్ 10సార్లు విజయం సాధించింది. మరో 9 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఇక ఈ 35 మ్యాచ్ లలో మెస్సీ 21 గోల్స్ చేశాడు. మరో 12 గోల్స్ లో పాలు పంచుకున్నాడు. ఇక రొనాల్డో 20 గోల్స్ చేయగా.. ఒక గోల్లో సాయం చేశాడు.
మెస్సీ గతంలో రియాద్ సీజన్ కప్ లో పారిస్ సెయింట్ జెర్మేన్ తరఫున ఆడాడు. ఆ టీమ్ కు గుడ్ బై చెప్పిన తర్వాత రొనాల్డోలాగే సౌదీ క్లబ్స్ లో ఒకదాంట్లో అతడు చేరతాడని భావించినా.. మెస్సీ మాత్రం ఇంటర్ మియామీతో చేతులు కలిపాడు. ఈ ఏడాది 8వసారి అతడు బాలన్ డోర్ అవార్డు కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే.