Sravana masam: శివుని ఆశీర్వాదాలు పొందేందుకు శ్రావణ మాసంలో ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకోండి
26 July 2024, 12:34 IST
- Sravana masam: పవిత్రమైన శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయాలి? ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి? మహాదేవుడి ఆశీస్సులు పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో ఏం చేయాలి?
Sravana masam: హిందూమతంలో శ్రావణమాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో మహా శివుడిని పూజిస్తారు. ఈ సమయంలో శివభక్తులు ప్రతి సోమవారం ఉపవాసాలు ఆచరిస్తారు. శివుడు, పార్వతి దేవి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం శ్రావణమాసం ఆగస్ట్ 5 నుంచి ప్రారంభమవుతుంది.
శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ మాసాన్ని ఉపవాసాలు, పండుగల మాసంగా పిలుస్తారు. శ్రావణమాసంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రావణమాసం అత్యుత్తమమైనది. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పరమేశ్వరుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ఎవరైతే శ్రావణ సోమవారాలు శివుడిని ఆరాధించి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
శ్రావణ సోమవారాలు ఉపవాసాలు ఆచరిస్తూ ఒక పూట భోజనం చేస్తారు. ధాన్యాలు తినకుండా ఉంటారు. ఆరోగ్యం, శ్రేయస్సు, జ్ఞానోదయం కోసం శివుని ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. అయితే ఈ మాసంలో ఏం చేయాలి? ఎటువంటి పనులు చేయకూడదు అనే వివరాలు తెలుసుకుందాం.
శివారాధన
ఈ మాసంలో శివరాధన తప్పనిసరి. శ్రావణమాసంలో క్రమం తప్పకుండా శివలింగానికి అభిషేకం చేయాలి. పాలు, నీరు, పెరుగు, నెయ్యి, తేనే, పంచామృతం ఉపయోగించి అభిషేకం చేయడం చాలా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శివునికి బిల్వపత్రాలు సమర్పించాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే తలస్నానం చేసి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేస్తే జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.
ఉపవాసం
శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. పరమశివుని ప్రత్యేక అనుగ్రహం పొందడం కోసం శ్రావణ సోమవారాలు ఉపవాసం ఆచరిస్తారు. పండ్లను మాత్రమే తీసుకోవాలి. శివలింగానికి అభిషేకం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయి.
మంత్ర పతనం
ఈ సమయంలో నిత్యం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల శక్తి లభిస్తుంది. ధ్యానం ప్రార్ధనలో సమయం గడపాలి. శివుని ఆరాధన శుభ ఫలితాలు కలుగుతాయి. లింగాష్టకం, మహా మృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల మరణ భయం నుంచి విముక్తి లభిస్తుంది.
దానం ప్రధానం
పేదలకు, అవసరంలో ఉన్న వారికి ఆహారం లేదా అన్నదానం, వస్త్ర దానం చేయాలి. అలాగే గోమాత సేవ తప్పనిసరిగా చేయాలి. జంతువులకు ఆహారం అందించాలి.
పరిశుభ్రత ముఖ్యం
ఇంట్లో పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే శుభ్రమైన దుస్తులు ధరించి పూజలు నిర్వహించాలి. నిష్టగా భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి.
తామసిక ఆహారం వద్దు
శ్రావణ మాసంలో మాంసాహారం, మద్యం, పొగాకు వంటివి తీసుకోకూడదు. ఉల్లి వెల్లుల్లి కూడా తామసిక ఆహారంగా పరిగణిస్తారు. అందువల్ల వాటికి కూడా దూరంగా ఉండాలి.
కోపం వద్దు
ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు కోపాన్ని నివారించాలి. ఇది మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. మతపరమైన కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుంది. ఇతరులకు సహాయం చేయాలి. దాతృత్వ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలి. మతపరమైన కార్యక్రమంలో పాల్గొనాలి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.