Holi festival: హోలీ రోజు తెలుపు రంగు దుస్తులు ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే
24 March 2024, 8:00 IST
- Holi festival: హోలీ రోజు ఎక్కువ మంది తెలుపు రంగు దుస్తులు ధరిస్తారు. రంగుల పండుగ రోజు వైట్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారనే దాని వెనుక మతపరమైన ప్రాముఖ్యత ఉంది. అదేంటో తెలుసా?
హోలీ రోజు తెలుపు రంగు దుస్తులు ఎందుకు వేసుకుంటారు?
Holi festival: ఆనందాన్ని ఇచ్చే రంగుల పండుగ హోలీ. ఈ ఏడాది మార్చి 25 సోమవారం వచ్చింది. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, రంగు నీటిని విసురుకుంటూ పువ్వులతో ఆడుకుంటూ, స్నేహితులు కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా రంగుల పండుగ చేసుకుంటారు. అందరూ ఒక చోటికి చేరి ఒకరికి మరొకరు రంగులు రాస్తూ శుభాకాంక్షలు చెప్తూ సీట్లు తినిపించుకుంటారు. హోలీ రోజు తప్పని సరిగా భంగ్ తాగుతారు. సన్నిహితులకు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.
హోలీ రోజు ప్రతి ఒక్కరూ తెలుపు రంగు దుస్తులే వేసుకుంటారు. రంగులు పడతాయి కదా తెలుపు రంగు దుస్తులు పాడైపోతాయని చాలామంది అనుకుంటారు. కానీ ఈ రంగు దుస్తులు వేసుకోవడం వెనుక కొన్ని మతపరమైన కారణాలు కూడా ఉన్నాయి.
తెలుపు శాంతి, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా హోలికా దహన్ నిర్వహిస్తారు. మరుసటి రోజు రంగుల పండుగ హోలీ వేడుకలు జరుపుకుంటారు.
హోలికా దహనం కథ
హోలీ అంటే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, హోలిక, విష్ణుమూర్తికి సంబంధించిన కథ ప్రాచుర్యంలో ఉంది. తనకున్న వర గర్వంతో హిరణ్యకశిపుడు దేవతలందరినీ హింసించసాగాడు. తనని తప్ప మరే దేవతలను పూజించటానికి వీల్లేదని ఆదేశిస్తాడు. కానీ హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తికి మహా భక్తుడు. కొడుకు నిత్యం శ్రీమన్నారాయణ స్మరణ చేయడంతో హిరణ్యకశిపుడు ఆగ్రహిస్తాడు.
ప్రహ్లాదుడు ప్రవర్తనకు ఆగ్రహించిన హిరణ్యకశిపుడు కొడుకుని సంహరించాలని భావించి తన సోదరి హోలిక పిలుస్తాడు. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నిలో ఉండమని హోలికకు చెప్తాడు. ఆమెకు మంటలు అంటుకోకుండా ఒక మాయా వస్త్రం ఉంటుంది. ప్రహ్లాదుడిని హోలిక ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చున్న సమయంలో విష్ణు నామస్మరణ చేయడంతో మంటలు ప్రహ్లాదుడిని ఏమి చేయలేవు. ఆ మంటల్లో హోలిక దహనం అవుతుంది. హిరణ్యకశిపుడు ప్రవర్తనకు ఆగ్రహించిన విష్ణుమూర్తి నరసింహ అవతారం ధరించి రాక్షస సంహారం చేస్తాడు.
తెలుపు స్వచ్ఛత, మంచితనం, శాంతి, సామరస్యం భావాలను సూచిస్తుంది. చెడు జ్ఞాపకాలను మరిచిపోయి మంచిని స్వీకరించాలని కోరుకుంటూ హోలీ జరుపుకుంటారు. హోలీ సోదర భావానికి చిహ్నంగా పరిగణిస్తారు. రంగుల పండుగ రోజు తెలుపు వస్త్రాలు ధరించడం వల్ల శాంతి, ప్రశాంతతను ఇస్తాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. అన్ని రకాల చింతలు, భయాలనుండి విముక్తి లభిస్తుంది. ఈరోజు ప్రశాంతంగా ఉండేలా తెలుపు రంగు మనసులను ప్రేరేపిస్తుంది.
మతపరమైన ప్రాముఖ్యత ఏంటంటే..
హోలీ సమయంలో రాహువు స్వభావం కోపంగా ఉంటుంది. ఫలితంగా రాహు చెడు ప్రభావాల కారణంగా వ్యక్తి చెడు సహవాసంల్లో పడతాడు. ఆ వ్యక్తిని నెగటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. దాని ప్రభావం కుటుంబ సంబంధాల మీద పడుతుంది. అందుకే రాహువు ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు తెల్లని వస్త్రాలు ధరిస్తారు.
టాపిక్