Holi pournami 2024: హోలీ పౌర్ణమి విశిష్టత ఏంటి? లక్ష్మీదేవి ఆరాధనకు ఎందుకంత ప్రాముఖ్యత
Holi pournami 2024: హోలీ పౌర్ణమి విశిష్టత ఏంటి? ఆరోజు లక్ష్మీదేవి ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
Holi pournami 2024: మార్చి 2024 చిలకమర్తి పంచాంగరీత్యా ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఫాల్గుణ మాస శుక్లపక్ష పౌర్ణమి అయ్యింది. దీన్నే వసంత పౌర్ణమి, ఫాల్గుణ పౌర్ణమి,హోలీ పౌర్ణమి వచ్చాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, లక్షీ నరసింహస్వామిని పూజించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, వసంతోత్సవాలు వంటివి చేసుకోవడం చాలా పుణ్యప్రదమని చిలకమర్తి తెలిపారు. పౌర్ణమిని అత్యంత అదృష్టవంతమైన రోజుగా పరిగణిస్తారు. అందులో ఫాల్గుణ పౌర్ణమి మరింత విశిష్టత సంతరించుకుంటుంది. ఈ సంవత్సరం మార్చి 25న ఫాల్గుణ పౌర్ణమి వచ్చింది. మార్చి 24 ఉదయం 09. 54కు పౌర్ణమి తిథి ప్రారంభమై, 25 మధ్యాహ్నం 12.29 వరకు ఉంటుందని చిలకమర్తి తెలిపారు.
ఫాల్గుణ మాసం సంవత్సరంలో చివరి నెల. అందువల్ల ఫాల్గుణ పూర్ణిమ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. హైందవంలో ముఖ్యమైన పర్వదినంగా భావించే వసంతోత్సవం ఈరోజునే జరుపుకుంటారు. ఈరోజు వసంత రుతువు రాకను సూచిస్తుంది. ఈ రోజున చంద్రుడు శక్తివంతంగా ఉంటాడని చిలకమర్తి తెలిపారు. ఈ సంవత్సరంలో ఇది చివరి పౌర్ణమి. ఈ పవిత్రమైన రోజు ఉపవాసం ఉండి, చంద్రుడిని, శ్రీహరిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే అనేక దోషాల నుండి విముక్తి పొందుతారని శాస్త్ర వచనం.
ఫాల్గుణ పౌర్ణమి రోజును లక్షీ ఆవిర్భావ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అందువల్ల ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటిగా భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజున నరసింహస్వామిని కూడా విశేషంగా పూజిస్తారు. ఈరోజున ఉదయమే నిద్ర లేచి స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించి విష్ణువును పూజించాలి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి. చంద్రుడు ఉదయించిన తరవాత ఉపవాసం విరమించాలి. ఈ రోజు సానుకూలమైన ఆలోచనలు చేయాలి. ఎవరి మనోభావాలను గాయపరచకుండా చూసుకోవాలి. విష్ణు ప్రీతికరమైన ఫాల్గుణంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించి, పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతకంలో నాగదోషం ఉంటే ఈ రోజు హోమాలు జరిపిస్తే తొలగిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.