Vat savitri vratam 2024: వట సావిత్రి వ్రతం రోజు స్త్రీలు మర్రి చెట్టుకు రక్షా సూత్రం ఎందుకు కడతారు?
02 June 2024, 9:00 IST
- Vat savitri vratam 2024: వట సావిత్రి వ్రతాన్ని పెళ్ళైన ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఆచరిస్తుంది. భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఆచరించి పూజలు చేస్తారు. ఈరోజు స్త్రీలు మర్రి చెట్టుకు రక్షా సూత్రం కడతారు. అలా ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకుందాం.
వట సావిత్రి వ్రతం 2024
Vat savitri vratam 2024: హిందూ మతంలో వివాహిత స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం క్షేమంగా ఉండాలని భర్తలకు దీర్ఘాయువు ఇవ్వమని కోరుకుంటూ అనేక ఉపవాసాలు పాటిస్తారు. వాటిలో ముఖ్యమైనది వట సావిత్రి వ్రతం. జూన్ 6వ తేదీ వట సావిత్రి వ్రతం వచ్చింది.
మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా మహిళలు కటిక ఉపవాసం ఆచరిస్తారు. ఇందులో భాగంగా మహిళలు పాటించే ముఖ్యమైన ఆచారం ఒకటి మర్రి చెట్టును పూజించడం. ఈ వ్రతం రోజు తప్పనిసరిగా మర్రి చెట్టుకు పూజలు చేసి దాని చుట్టూ ఒక దారం చుడతారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దారం చుడతారు. అలా ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం.
యమధర్మరాజు నుంచి పతి ప్రాణాలు వెనక్కి తీసుకొచ్చిన పతివ్రత సతీ సావిత్రి. వారిని గుర్తు చేసుకుంటూనే ఈ వ్రతం ఆచరిస్తారు. యముడు సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్లినప్పుడు సావిత్రి తన భర్తను మర్రి చెట్టు కింద ఉంచిందని చెప్తారు. మర్రి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. బ్రహ్మ చెట్టు మొదట్లో, విష్ణువు కాండంలో, శివుడు కొమ్మలు పైభాగంలో ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. సృష్టికర్తలు నివసించే ఈ చెట్టును దేవవృక్షం అని పిలుస్తారు.
రక్షా సూత్రం ఎందుకు కడతారు?
వట సావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టుకు స్త్రీలు రక్షా సూత్రాన్ని కడతారు. చెట్టు కింద సావిత్రిని, సకల దేవతలను పూజించి తమ భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని వేడుకుంటారు. మర్రి చెట్టు జ్ఞానం, దీర్ఘాయువుని పోలి ఉంటుంది. మహిళలు చెట్టు కింద సావిత్రి దేవి, యముడు, గౌరీ దేవికి పూజ చేస్తారు. వారిని స్మరించుకుంటూ మర్రి చెట్టు మూలాలకు నీరు, పచ్చి పాలు సమర్పిస్తారు. తర్వాత చెట్టు కింద దీపం వెలిగిస్తారు. వివాహిత స్త్రీలు రక్షా సూత్రం తీసుకుని మర్రి చెట్టు చుట్టూ ఏడు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తూ మంత్రాలను జపిస్తూ కడతారు. ముడి దారాన్ని ఏడు సార్లు చుట్టడం అంటే భర్తతో వారి సంబంధం ఏడు జీవితాల వరకు ఉంటుందని సూచించడం.
ఇది మాత్రమే కాకుండా మర్రి చెట్టుకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆక్సిజన్ కి నిధిగా పరిగణిస్తారు. ఈ చెట్టు నుంచి వచ్చే మొగ్గలు తిని కొంతమంది స్త్రీలు తమ ఉపవాసాన్ని పూర్తి చేస్తారు. ఈ మొగ్గలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అద్భుతమైన రోగనిరోధక శక్తి ఉంది. అందుకే వీటిని తీసుకుంటారు. హిందూ సంప్రదాయంలో కర్వా చౌత్ కి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఈ వ్రతానికి కూడా ఉంది.
ఈ రక్షా సూత్రాన్ని కట్టిన తర్వాత సావిత్రి, సత్యవంతుడి కథ వినడం లేదా చదవడం చేస్తే వ్రత ఫలితం దక్కుతుంది. అలాగే పూజ చేసిన తర్వాత ఏడు లేదా పదకొండు మంది వివాహిత స్త్రీలకు పండ్లు లేదా వివాహానికి సంబంధించిన వస్తువులు ఏవైనా దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రతం ఆచరించడం వల్ల వివాహ బంధం బలపడుతుంది. మెరుగైన వైవాహిక జీవితం లభిస్తుంది.