Vat savitri vratam 2024: వట సావిత్రి వ్రతం ఎప్పుడు వచ్చింది? ఈరోజు మర్రి చెట్టును ఎందుకు పూజిస్తారు?
Vat savitri vratam 2024: మహిళలు తమ భర్త దీర్ఘాయువు కోరుతూ తప్పనిసరిగా వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు. ఈ ఏడాది జూన్ 6వ తేదీ వట సావిత్రి వ్రతం జరుపుకోనున్నారు. ఈరోజు మర్రి చెట్టుకు పూజలు చేస్తారు.
Vat savitri vratam 2024: అదృష్టాన్ని ఇచ్చే వట సావిత్రి వ్రతాన్ని ఈ ఏడాది జూన్ 6వ తేదీ జరుపుకోనున్నారు. అదే రోజు శని జయంతి కూడా వచ్చింది . వివాహిత స్త్రీలు వట సావిత్రి వ్రతం రోజు ఉపవాసం ఆచరిస్తే భర్త దీర్ఘాయుష్హు పొందుతాదని నమ్ముతారు. మహా పతివ్రత సావిత్రి కథ గురించి అందరికీ తెలిసిందే.
మర్రిచెట్టును ఎందుకు పూజిస్తారు?
వట సావిత్రి వ్రతం రోజు అందరూ వట వృక్షాన్ని పూజిస్తారు. తప్పనిసరిగా మర్రి చెట్టును పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పూజ చేసేందుకు మహిళలు మర్రి చెట్టు దగ్గరకు వెళతారు. రెండు బుట్టలు తీసుకుని ఒకదాంట్లో బ్రహ్మ విగ్రహాన్ని ప్రతిష్టించి ఎడమవైపు సావిత్రి విగ్రహాన్ని ప్రతిష్టించాలని పండితులు చెబుతున్నారు.
రెండో బుట్టలో సత్యవంతుడు, సావిత్రి విగ్రహాలను ప్రతిష్టించాలి. ఈ రెండు బుట్టలను మర్రి చెట్టు కింద ఉంచాలి. మొదటగా బ్రహ్మను పూజించిన తర్వాత సత్యవంతులు సావిత్రిని పూజించాలి. తర్వాత మరి చెట్టుకు నీళ్లు పోయాలి.
నీళ్లు, రోలి, శనగలు, బెల్లం, ధూప దీపంతో మర్రి చెట్టును పూజించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత చెట్టు చుట్టూ దారాన్ని మూడుసార్లు చూడుతూ ప్రదక్షిణలు చేయాలి. తర్వాత మర్రి చెట్టు ఆకులతో ఏర్పాటు చేసిన దండ ధరించి వట సావిత్రి వ్రతం కథ వినాలి. ఈ చెట్టును పూజించడం వెనుక కారణం ఉంది. ఎందుకంటే మర్రి చెట్టు కింద ఉన్నప్పుడే సత్యవంతుడి ప్రాణాలను సావిత్రి యమధర్మ రాజు దగ్గర నుంచి తిరిగి తెచ్చుకుంది. వీరిద్దరూ ఈ చెట్టు కింద ఉంటారని చెబుతారు.
మర్రి చెట్టు ప్రాముఖ్యత
రావి చెట్టు మాదిరిగానే మర్రి చెట్టుకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ వట వృక్షంలో నివసిస్తారు. అందుకే మర్రి చెట్టు కింద పూజలు చేస్తూ ఉపవాస గాధ వింటే కోరిన కోరికలు నెరవేరుతాయి. దీర్ఘాయుష్షు లభిస్తుంది. అందుకే ఈ చెట్టుని అక్షయవత్ గా కూడా పిలుస్తారు.
మర్రి చెట్టును పూజించడం వల్ల దీర్ఘాయుష్షు, సుఖసంతోషాలు, సౌభాగ్యం లభిస్తాయి. అన్ని రకాల కలహాలు, బాధలు తొలగిపోతాయి .మరి చెట్టు వేర్లకి పచ్చిపాలు పోసి తర్వాత నీటిని సమర్పించి ఏడుసార్లు దారాన్ని చూడుతూ ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబంపై వచ్చే కంటికి కనిపించని అడ్డంకులు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయి.
వట సావిత్రి వ్రతం కథ
సావిత్రి అశ్వపతి ఏకైక సంతానం. ద్యుమతేన్సుడి కుమారుడు సత్యవంతుడు. అతడి ఆయుష్షు ఎక్కువ రోజులు లేదని తెలిసినప్పటికీ సత్యవంతుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రాజభవనంలో అన్ని సుఖాలు, వైభవాన్ని అనుభవించిన సావిత్రి వివాహం జరిగిన తర్వాత అడవిలో భర్తతో కలిసి నివసిస్తుంది.
మర్రి చెట్టు కింద సావిత్ర దంపతులు కూర్చున్న సమయంలో ఒకనాడు యమధర్మ రాజు అతడి ప్రాణాలు తీసుకోవడానికి వస్తాడు. తన భర్త ప్రాణాలు తీసుకెళ్లవద్దని సావిత్రి వేడుకుంటుంది. కానీ ధర్మరాజు ఒప్పుకోడు .అప్పుడు సావిత్రి యముడిని విడిచిపెట్టకుండా అనుసరించడం ప్రారంభిస్తుంది. ఎన్నిసార్లు నిరాకరించిన ఆమె ఒప్పుకోకపోవడంతో సావిత్రి ధైర్య సాహసాలకు, త్యాగానికి మెచ్చుకుని మూడు వరాలు కోరుకోమని చెబుతాడు.
సావిత్రి సత్యవంతుడి తల్లిదండ్రులకు కళ్ళు ఇవ్వమని కోరుకుంటుంది. తర్వాత శత్రువుల చేతిలో ఉన్న తమ రాజ్యాన్ని ఇవ్వమని కోరుకుంటుంది. మూడో కోరికగా తనకు వంద మంది కుమారులు ఇవ్వాలని అడుగుతుంది. సావిత్రి పతిభక్తికి మెచ్చుకున్న యమధర్మరాజు ఆమె భర్త ప్రాణాలు తిరిగి ఇస్తాడు.